ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. పొలిటికల్ చిత్రాల వేడి కూడా మొదలైంది. గత ఎన్నికలకు ముందు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’తో ప్రయోజనం పొందిన వైపీపీ.. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయోపిక్నే రెడీ చేయించింది. జగన్ రాజకీయ ప్రస్థానం చుట్టూ ‘యాత్ర’ దర్శకుడు మహి.వి.రాఘవ్ రూపొందించిన ‘యాత్ర-2’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే చనిపోయిన వైఎస్ మీద ఉద్వేగాల కలబోతతో తీసిన ‘యాత్ర’తో పోలిస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అధికారం అనుభవిస్తున్న వైఎస్ జగన్కు ఎలివేషన్ ఇస్తూ తీసిన ‘యాత్ర-2’లో ఎమోషనల్ డెప్త్ మిస్ అయిందనే అభిప్రాయాలు సినిమా చూసిన వాళ్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. జగన్ అభిమానులకు ఈ సినిమా సూపర్ అనిపించినా.. ‘యాత్ర’ లాగా న్యూట్రల్ ఆడియన్స్కు కనెక్ట్ కావడం కష్టమే అనిపిస్తోంది.
‘యాత్ర-2’ పూర్తి కన్వీనియెంట్, వన్ సైడెడ్ బయోపిక్ అనడానికి ఇందులో చాలా రుజువులున్నాయి. జగన్ అంత ఉత్తముడు ఇంకెవరూ లేరు.. మిగతా రాజకీయ నాయకులందరూ కుట్రదారులే అన్నట్లుగా ఇందులో చూపించారు. జగన్కు ప్రతికూలమైన చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ లాంటి వాళ్లను విలన్లుగా చూపించడంలో దర్శకుడు మహి.వి.రాఘవ్ ఏమాత్రం మొహమాట పడలేదు. రాజీ పడలేదు. అదే సమయంలో జగన్కు ఇబ్బంది కలిగించే వ్యక్తుల పాత్రలు సినిమాలో లేకుండా చూసుకున్నారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది.. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన జైల్లో ఉండగా కష్టపడి పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిళ. జగన్ జైలుకు వెళ్లినపుడు తల్లి, భార్యనే ఆయన కోసం పోరాడినట్లు.. విజయమ్మ జనాల్లో కూడా తిరిగినట్లు చూపించారు. కానీ ఎక్కడా షర్మిళ ప్రస్తావనే లేదు. ఇది వైఎస్ కుటుంబ అభిమానులు కూడా జీర్ణించుకోలేనిదే. మరోవైపు పవన్ కళ్యాణ్, వైఎస్ వివేకా లాంటి పాత్రలు కూడా సినిమాలో కనిపించలేదు. ఒక చోట మాత్రం చంద్రబాబు పాత్రతో తలాతోకా లేని పార్టీ అంటూ పరోక్షంగా జనసేన మీద కౌంటర్ వేయించాడు మహి. మొత్తంగా చూస్తే ‘యాత్ర-2’ జగన్ను హీరోను చేయడానికి తీసిన వన్ సైడెడ్ బయోపిక్ అనడంలో సందేహం లేదు.