టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రా..కదలిరా! సభలు ఏపీలో కొనసాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఆయన రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. అయితే..ఆయన పాల్గొనే ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని చింతలపూడి అసెంబ్లీ సెగ్మెంట్లో కలకలం రేగింది. సోమవారం ఉదయం విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో రా.. కదలిరా! సభలో చంద్రబాబు పాల్గొన్నారు. దీనిని ముగించుకుని.. జిల్లా నేతలతో భేటీ కానున్నారు.
అనంతరం.. ఆయన చింతలపూడి సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే.. చింతలపూడి సభకు కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద కలకలం రేగింది. ఈ సభను భగ్నం చేసేందుకు, చంద్రబాబును అంతమొందించేందుకు ఎవరో బాంబు పెట్టారంటూ.. ఆగంతకులు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని హెలిపాడ్ వద్ద మెటల్ డిటెక్టర్‌తో చెక్ చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దం వెలువడింది. దీంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయింది.
శబ్దం వెలువడిన ప్రాంతంలోలోతుగా తవ్వి చూశారు. అయితే..అక్కడ ఇనుప రాడ్ తప్ప ఏమీ కనిపించలే దు. దీంతో పోలీసులు, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, భారీ శబ్దం రావడం వెనుక కారణాలేం టనే విషయంపై పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ జల్లెడ పడుతున్నారు. మరోవైపు.. 11 అంకెలతో వచ్చిన ఫోన్‌పైనా విచారణ చేపట్టారు. ఈ ఫోన్ ఎవరు చేశారు? ఎక్కడ నుంచి చేశారు? అనే విషయాన్ని కూడా ఆరాతీస్తున్నారు.
ఇదిలావుంటే.. ఈ విషయం పై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని సీఎంవో వర్గాలు డీజీపీకి ఫోన్ చేసి చెప్పాయి. కాగా, ఈ రోజు సాయంత్రం 6గంటలకు చంద్రబాబు ఈ సభలో పాల్గొననున్నారు. అయితే.. తనిఖీల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.