ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రిలీజైన యాత్ర సినిమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగానే కలిసొచ్చింది. వైఎస్ అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తించి.. వైకాపా పట్ల సానుకూలతను పెంచడంలో ఆ సినిమా ఉపయోగపడింది. అప్పటి జనాల మూడ్‌ను ఆ సినిమా సక్సెస్ ప్రతిబింబించింది కూడా. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎన్నికలకు వైఎస్ జగన్ పాదయాత్ర చుట్టూ ‘యాత్ర-2’ సినిమా తీసి సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదలకు సిద్ధం చేశారు.
ఐతే వైఎస్ అంటే మరణించిన వ్యక్తి. ఆయనకున్న ఇమేజ్ వేరు. కానీ జీవించి ఉండడమే కాక.. సీఎంగా అధికారం అనుభవిస్తున్న వ్యక్తి.. పైగా వైఎస్‌తో పోలిస్తే భిన్నమైన ఇమేజ్ ఉన్న జగన్ మీద బయోపిక్ తీసి ఎన్నికలకు ముందు రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి.
వైఎస్ జగన్ సర్కారు మీద వ్యతిరేకత పెల్లుబుకుతున్న సమయంలో ‘యాత్ర-2’ విడుదల కాబోతోంది. పైగా ఈ సినిమా ట్రైలర్లో చూపించిన చాలా అంశాలు వాస్తవ దూరంగా అనిపిస్తున్నాయి.
జగన్‌కు ఎలివేషన్ ఇస్తూ.. చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ లాంటి వాళ్ల ప్రతిష్టను దెబ్బ తీసేలాగే సినిమా తీశారని స్పష్టమవుతోంది. చంద్రబాబుకు విలువలే ఉండవన్నట్లు.. జగన్ అంటే క్రెడిబిలిటీకి మారు పేరు అన్నట్లుగా ట్రైలర్లో చూపించారు. క్రెడిబిలిటీ అనేదే లేకపోతే తాను, వైఎస్ లేనే లేరు అన్నట్లుగా జగన్ పాత్రతో డైలాగ్ చెప్పించారు. కానీ మద్యపాన నిషేధం చేయకుంటే ఓట్లే అడగను అన్న జగన్.. ఆ హామీ దిశగా కనీస ప్రయత్నం కూడా చేయలేదు. మద్యం మీద వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తా అని అధికారంలోకి రాగానే దాని మీద అవగాహన లేదనేేశాడు.
ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని మాట తప్పాడు. రాజధాని, పోలవరం, ప్రత్యేక హోదా.. ఇలా అనేక అంశాల్లో జగన్ మాటలు నీటి మీద రాతలయ్యాయి. ఇలా జగన్ మాట తప్పి క్రెడిబిలిటీ కోల్పోయిన అంశాలు బోలెడున్నాయి. అలాంటిది సినిమాలో క్రెడిబిలిటీ గురించి, మాట మీద నిలబడడం గురించి ఎలివేషన్ డైలాగులు పెడితే.. జనాలకు జగన్ హామీలన్నీ గుర్తుకొచ్చి ఆయన మీద ఇంకా వ్యతిరేకత పెంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ‘యాత్ర-2’ వల్ల కలిగే ప్రయోజనం కంటే డ్యామేజీనే ఎక్కువేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.