బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే పేరు ప్రస్తుతం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో మార్మోగిపోతోన్న సంగతి తెలిసిందే. గర్భాశయ కాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఆమె చేసిన పని వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సర్వికల్ క్యాన్సర్ తో పూనం పాండే చనిపోయిందంటూ ఆమె పిఆర్ టీం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడంతో అది నిజమే అని నమ్మారు మీడియా సంస్థల ప్రతినిధులు. అయితే, తాను గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేయాల్సి వచ్చిందని పూనం పాండే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.
కానీ, ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి పూనం పాండే మీడియాను ఫూల్ చేసింది అని చెప్పవచ్చు. సాధారణంగా ఎవరైనా సెలబ్రిటీలు చనిపోతే వారి అనారోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్లను సంబంధిత ఆసుపత్రి వర్గాలు విడుదల చేస్తాయి. అంతేకాకుండా ఆస్పత్రి నుంచి ఆయా సెలబ్రిటీల మృతదేహాలు బయటకు వస్తున్న ఫోటోలు, వీడియోలు… వారి ఇళ్ల దగ్గర అభిమానుల హడావిడి ఫోటోలు, వీడియోలు ప్రసారమవుతుంటాయి.
కానీ, పూనం పాండే విషయంలో అదేమీ జరగలేదు. దీన్నిబట్టి మీడియాను పూనం పండే ఫూల్ చేసిందని చెప్పవచ్చు. ఇవేమీ నిర్ధారించుకోకుండా, ఆమె చనిపోయింది అన్న వార్తను అధికారికంగా ధ్రువీకరించకుండా కేవలం ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ని ఆధారం చేసుకుని దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఆ వార్తను ప్రసారం చేయడం విశేషం. దీంతో, సోషల్ మీడియా వార్తలపై ఆధారపడి అసలు మీడియాకు ఉండవలసిన లక్షణాలను మర్చిపోయే స్థాయికి మీడియా దిగజారిందని విమర్శలు వస్తున్నాయి.
గతంలో అయితే సోషల్ మీడియా రాకముందు ఒక వార్తలో నిజా నిజాలు ఎంత దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటి అన్న విషయాలు ధ్రువీకరించుకున్న తర్వాత గాని ప్రింట్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని ప్రసారం అయ్యేది కాదు. కానీ, సోషల్ మీడియా ప్రభావం ఎక్కువయిన తర్వాత చాలా మీడియా సంస్థలు సోషల్ మీడియాపై వార్తల కోసం ఆధారపడాల్సిన పరిస్థితికి దిగజారాయి. సెలబ్రిటీలు, క్రీడాకారుల సోషల్ మీడియా పోస్టులపై మీడియా సంస్థలు ఫోకస్ పెట్టి మరీ వార్తలు రాసే పరిస్థితి వచ్చిందంటే మీడియా ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాపై ఆధారపడే మెజార్టీ మీడియా సంస్థలు సాగిస్తున్నాయని పూనం పాండేతో పాటు ఫుడ్ ట్రక్ కుమారి ఆంటీ ఎపిసోడ్ నిరూపించాయి. ఇకనైనా మీడియా సంస్థలు తమ స్వయం ప్రతిపత్తిని వదులుకోకుండా, తమ పద్ధతులను అనుసరించి వార్తలను ప్రచారం చేయకపోతే మీడియా విశ్వసనీయత రాబోయే రోజుల్లో పూర్తిగా మంటగలిసి పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.