బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయినట్లుగా నిన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పూనమ్ పాండే మరణించారని ఆమె పీఆర్ టీం అధికారికంగా పూనమ్ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆ వార్త నిజమని అంతా అనుకున్నారు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె శవాన్ని చూపించకుండా, ఆమె ఏ ఆస్పత్రిలో చికిత్స పొందిందో చెప్పకుండా చనిపోయింది అంటున్నారని, బహుశా ఇది ఏదో ప్రచారం కోసం చేసిన ఫేక్ వార్త అని కామెంట్ కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ నెటిజన్ల కామెంట్లను నిజం చేస్తూ తాజాగా తాను బతికే ఉన్నాను అంటూ పూనమ్ పాండే ఓ వీడియోను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్ బారినపడి చాలా మంది మహిళలు చనిపోతున్నారని, అందుకే దానిపై అవగాహన కల్పించేందుకు తాను ఈ రకమైన ప్రచారాన్ని చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. తన ప్రకటన వల్ల బాధ పడిన వారికి, ఇబ్బంది పడిన వారికి పూనమ్ క్షమాపణలు చెప్పింది.
దీంతో, పూనమ్ చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సర్వికల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యం మంచిదేనని, కానీ, దానికి ఆమె ఎంచుకున్న మార్గం సరైనది కాదని ట్రోల్ చేస్తున్నారు. పులి మేక సామెత టైపులో ఇలా జనాలను వెర్రి పప్పలను చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.