ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తాజాగా అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది. 2019 ఎన్నికల సమయంలో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటనకు సంబందించి అప్పట్లోనే ఆయనపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి తాజాగా వంశీని అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుతం ఈ ఆదేశాలు అధికార పార్టీ వైసీపీని షాక్‌కు గురి చేశాయి.
ఏం జరిగింది?
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున వల్లభనేని వంశీ.. గున్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి కే ఆయన సిట్టింగు ఎమ్మెల్యే. అయితే.. ఆ సమయంలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య తీవ్ర యుద్ధం జరు గుతున్న నేపథ్యంలో వంశీ టీడీపీ తరఫున పోరాడుతున్నందున వైసీపీ నేతలపై పోలింగ్ బూత్‌లో అవక తవకలపై తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పట్లో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్‌లో వైసీపీ నాయకులు నకిలీ ఓట్లు వేస్తున్నారని వంశీకి తెలియడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మొత్తంఆ 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ ఎన్నికల్లో వంశీ విజయం దక్కించుకున్నారు. దీంతో ఈ కేసును ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించి గతంలో జరిగిన విచారణకు వంశీ డుమ్మాకొట్టారు. దీంతో పలు మార్లు వాయిదా వేశారు. అయినప్పటికీ.. విచారణను ఉద్దేశపూర్వకంగా తప్పించుకుంటున్నారని ప్రతివాదులైన పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు గత విచారణ సమయంలోనే వంశీకి బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.
ఖచ్చితంగా ఫిబ్రవరి 2న కోర్టుకు రావాలన ఆదేశించింది. అయితే శుక్రవారం నాటి విచారణకు కూడా వంశీ డుమ్మా కొట్టారు. దీంతో వంశీపై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ వారెంట్‌ను అమలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కాగా, ప్రస్తుతం వంశీ అందుబాటులో లేరని సమాచారం. గత ఎన్నికల తర్వాత.. వంశీ.. టీడీపీని వీడి వైసీపీ బాట పట్టిన విషయం తెలిసిందే.