ప్రపంచ కుబేరుల్లో ఒకడు. ప్రపంచాన్ని మార్చేయాలన్న తలంపు ఉన్న ఔత్సాహికుడిగా.. దూకుడు గా వ్యాపారం చేసి.. రాకెట్ వేగంతో లక్షల కోట్లు పోగేసిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎలాన్ మస్క్ అన్నంతనే టెస్లా పేరు గుర్తొస్తుంది. అలాంటి ఆయనకు కోపమొచ్చింది. తనలాంటోడి మీదనే కంప్లైంట్ చేయటం ఒక ఎత్తు అయితే.. సదరు కేసులో ఎదురుదెబ్బ తగలటాన్ని మస్క్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఇంతకూ అలాంటి పరిస్థితి ఎందుకంటే.. టెస్లాలో సీఈవోగా వ్యవహరిస్తూ భారీగా ప్యాకేజీ తీసుకోవటాన్ని ప్రశ్నిస్తూ కోర్టును ఆశ్రయించటం ఒక ఎత్తు అయితే.. సదరు కేసులో మస్క్ భారీ ప్యాకేజీ అందుకోవటానికి అర్హత లేదంటూ డెలావర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చారు. ఆ వెంటనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో టెస్లా హెడ్డాఫీస్ ను డెలావర్ నుంచి టెక్సాస్ కు మారుస్తున్నట్లుగా పేర్కొన్నారు. డెలావర్ కోర్టు తీర్పు నేపథ్యంలోనే మస్క్ తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇంతకూ డెలావర్ కోర్టు ఏం చెప్పిందన్న విషయానికి వస్తే.. టెస్లా సీఈవోగా వ్యవహరిస్తూ ఏడాదికి రూ.4.5 లక్షల కోట్ల భారీ పారితోషకం తీసుకోవటానికి ఎలాన్ మస్క్ అనర్హుడని డెలావర్ కోర్టు తీర్పును ఇచ్చింది. ఆ వెంటనే స్పందించిన ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. డెలావర్ రాష్ట్రంలో ఎవరూ తమ సంస్థల్ని రిజిస్టర్ చేసుకోవద్దని పిలుపునివ్వటం గమనార్హం.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టెస్లా హెడ్డాఫీసును టెక్సాస్ కు మర్చాలా? వద్దా? అన్న పోల్ పెట్టగా.. 80 శాతం మంది మార్పుకు అనుకూలంగా ఓటేయటం గమనార్హం. ఇంతకూ డెలావర్ వదిలేసి.. టెక్సాస్ కు హెడ్డాఫీసుకు షిప్టు ఎందుకు అవుతన్నారన్న విషయానికి వస్తే.. టెక్సాస్ రాష్ట్రంలో పన్ను శాతం తక్కువగా ఉండటంతో తన కంపెనీ హెడ్డాఫీసును మార్చాలన్న నిర్ణయాన్ని మస్క్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ నిర్ణయంతో డెలావర్ లో చాలా ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాకుండా, పెద్ద ఎత్తున పన్నులు కూడా కోల్పోనుంది.