ఏపీకి విశాఖ రైల్వే జోన్ రాకపోవడంలో సీఎం జగన్ పాత్ర ఉందని టీడీపీ నేతలు చాలాకాలంగా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతానని చెప్పిన సీఎం జగన్ మాత్రం తన కేసులకు భయపడి కేంద్రం పెద్దల ముందు మోకరిల్లారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా టీడీపీ నేతల విమర్శలు నిజమని తేలాయి. ఏపీలో రైల్వే జోన్ కు తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ ఆ రైల్వే జోన్ ఏర్పాటుకు 53 ఎకరాల స్థలం కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
భూమి కేటాయించడంలో జగన్ సర్కార్ జాప్యం చేయడం వల్లే రైల్వే జోన్ ప్రతిపాదన ముందుకు సాగలేదని ఆయన తేల్చి చెప్పేశారు. దీంతో, లోక్ సభ సాక్షిగా రైల్వే జోన్ పై జగన్ కపట ప్రేమ పరదాలు తొలగిపోాయాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్లు చేశారు. విశాఖ భూమాతను కబ్జాల గుప్పెట్లో బందీ చేసిన సీఎం జగన్ సిగ్గు పడాలని, రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వలేకపోయిన జగన్ ఎన్నికలకు మాత్రం సిద్ధం అని ప్రకటించారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో విశాఖలో వైసీపీ నేతలు భూధందాలకు పాల్పడ్డారని, లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములను వైసీపీ సామంత రాజులు దోచుకున్నారని ఆరోపించారు. విశాఖలో విలాసవంతమైన రాజ భవనాల కోసం వైసీపీ నేతలు వందల కోట్లు పెట్టారని, దానికి భూమి దొరుకుతుందని విమర్శించారు. విశాఖలో గత ఐదేళ్లలో వైసీపీ నేతలు దోచుకున్న భూముల లెక్కలు చెప్పడానికి తాము సిద్ధమని, దానికి, వైసీపీ నేతలు సిద్ధమా అని గంటా సవాల్ విసిరారు.
రైల్వే జోన్ కోసం డీపీఆర్ కూడా సిద్ధమైందని, ఏపీ ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెడతామని అశ్విని వైష్ణవ్ చెబుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని గంటా ఆరోపించారు. విశాఖకు రైల్వేజోన్ రాకపోవడానికి వైసిపి ప్రభుత్వం కారణమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, దీనిపై సీఎం జగన్ స్పందించాలని గంటా డిమాండ్ చేశారు.