కుమారి ఆంటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. హైదరాబాద్ సిటీలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్‌తో ఆమె పాపులారిటీ సంపాదించారు. విజయవాడకు చెందిన ఆమె కుటుంబంతో కలిసి చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు వచ్చేసి అక్కడ ఫుట్ పాత్ మీద ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు. రీజనబుల్ ధరలతో వెజ్, నాన్ వెజ్ భోజనం వడ్డిస్తూ ఆమె వ్యాపారాన్ని పెంచుకున్నారు.
ఐతే ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ ఛానెళ్ల దృష్టి ఆమె మీద పడింది. దీని వల్ల మొదట కుమారి ఆంటీకి పాపులారిటీ వచ్చి బిజినెస్‌కు హెల్ప్ అయింది. కానీ అటెన్షన్ పెరిగేకొద్దీ సమస్యలు మొదలయ్యాయి. జనంతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, మీడియా వాళ్ల తాకిడి పెరిగిపోయి ట్రాఫిక్ సమస్యలు పెరిగి పెద్ద న్యూసెన్స్ లాగా తయారైంది. దెబ్బకు పోలీసులు జోక్యం చేసుకుని ఆమె బిజినెస్ ఆపించేశారు.
ఐతే కుమారి ఆంటీకి పాపులారిటీ వచ్చాక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఆస్తిపాస్తులేమీ లేవని.. ఏపీలో జగనన్న ఇచ్చిన ఇల్లు ఒక్కటి మాత్రమే ఉందని వ్యాఖ్యానించింది. దీన్ని వైసీపీ సోషల్ మీడియా వాడుకోవడం మొదలుపెట్టింది. జగన్ వల్లే ఆమె ఎదిగిపోయినట్లు వాళ్లు కలర్ ఇచ్చుకున్నారు. ఇంతలో కుమారి బిజినెస్ ఆగిపోగా.. కుమారి జగన్‌ను పొగడ్డం ఇష్టం లేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మరీ కుమారి ఆంటీ బిజినెస్ మూయించేసినట్లు వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో విడ్డూరమైన ట్వీట్ వేసేశారు.
కట్ చేస్తే ఇప్పుడు కుమారి ఆంటీ బిజినెస్ ఆగిపోవడం గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడిచి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆమె బిజినెస్ మరోచోట కొనసాగేలా చూడాలని ఆయన పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. అంతే కాక తాను కుమారి ఆంటీ హోటల్‌ను కూడా సందర్శిస్తానని చెప్పారు. దీనికి కొత్త భాష్యం చెబుతూ.. చంద్రబాబు, పవన్ భయపడి తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆమె బిజినెస్ తిరిగి ఓపెన్ చేయిస్తున్నారని వైసీసీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటుందా అంటూ కౌంటర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.