అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ అధికార పార్టీ వైసీపీకి తాజాగా భారీ షాక్ తగిలింది. 2022లో చోటు చేసుకున్న అమలాపురం అల్లర్ల వ్యవహారంలో కీలక సామాజిక వర్గం.. శెట్టిబలిజ వర్గీయులపై నమోదైన 6 ఎఫ్ ఐఆర్లకు సంబంధించిన 21 కేసులను వైసీపీ ప్రభుత్వం ఎత్తేయడాన్ని తప్పుబట్టింది. ఈ కేసులు ఎలా ఎత్తివేస్తారని.. జరిగింది.. మామూలు ఘటన కాదని కోర్టు వ్యాఖ్యానించింది.
“మంత్రి ఇల్లు తగుల బెట్టారు. ప్రజాప్రతినిధులను పరుగులు పెట్టించారు. ఒక శాసన సభ్యుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇలాంటి కేసులను ఎత్తేయాలని అసలు ఎందుకు అనిపించింది. దీనివెనుక ఎవరి ఒత్తిడి ఉంది“ అని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోర్టు నిలదీసింది. కేసులు ఎత్తేయడానికి గల కారణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఎవరైనా కోరారని.. మర్డర్ చేసిన వ్యక్తిని కూడా ఇలానే వదలేస్తారా? అని ప్రశ్నించింది. ఇలా కేసులు ఎత్తేయడానికి ఎవరి ఒత్తిడి పనిచేసిందో చెప్పాలని పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది.
అంతేకాదు.. అల్లర్లపై నమోదైన కేసులను ఎత్తివేయడం కుదరదని.. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవోను బుట్టదాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేవలం ఈ కేసుల విషయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తాజాగా ఆదేశించింది. ఈ పరిణామం.. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రబుత్వానికి ఇబ్బందిగామారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగింది?
రాష్ట్రంలో జిల్లాల విభజన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాను విభజించి.. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేశారు. అయితే.. దీనికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ నాయకులు, ఆ సామజిక వర్గం పౌరులు ఆందోళన చేశారు. తొలుత దీనిని పట్టించుకోని ప్రభుత్వం చాలా రోజులకు అనూహ్యంగా పేరు మార్చేసింది.. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టింది.
అయితే.. ఇలా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ.. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన యువతపెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్రమంలో మంత్రి, ఎస్సీ నాయకుడు పినిపే విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు. అదేసమయంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇంటిని ధ్వంసం చేశారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఆరు ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు 21 కేసుల్లో మొత్తం 50 మందిని అరెస్టు చేశారు. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల ఒత్తిడితో ఈ కేసులు ఉపసంహరిస్తూ.. గత డిసెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ జీవోను సవాల్ చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి కన్వీనర్ జంగా బాబురావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మొత్తం 6 ఎఫ్ఐఆర్ల కేసుల ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 20న జీవో జారీ చేసిందని గుర్తు చేస్తూ, దానిని నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు.