కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఏపీ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాకూర్ తాజాగా చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వైసీపీకి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగులు తారని ఠాకూర్ తన ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు చేశారు. ఇది జోరుగా వైరల్ అయింది. “జగన్ పార్టీలో కేవలం ముగ్గురు లోక్‌సభ ఎంపీలు మాత్రమే మిగిలి ఉంటారని నాకు తెలిసింది. ఆహా.. ఎంత అభివృద్ధి చెందుతున్న రాజకీయ సామ్రాజ్యం!“ అని ఠాకూర్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ పోస్టు రాజకీయంగా కలకలం రేపింది. ఇప్పటికే పలువురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. నరసాపురం ఎంపీ రఘురామ ఎప్పుడో పార్టీకి దూరమయ్యారు. పార్టీలోనే ఉన్నప్పటికీ.. వ్యవహా రాల పరంగా ఆయన వేరేగా ఉన్నారు. ఇక, తాజాగా టికెట్ల రగడ కారణంగా.. నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మచిలీపట్నం ఎంపీ బాల శౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ముగ్గురే మిగులుతారని మాణిక్యం వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదిలావుంటే.. గత 2019 ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను 22 దక్కాయి. వీటిలో ఇప్పుడు నలుగురు దూరమైతే. ఇంక మిగిలేది కేవలం 18. వీరిలోనూ వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పార్టీకి దూరంగా పెట్టారు. ఆయనకు టికెట్ లేదని అన్నారు. ఇక, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టికెట్ లేదని తేల్చిచెప్పారు. దీంతో వారంతా కూడా పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి తాజాగా ఠాకూర్ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది.