తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజాయుద్ధ నౌకగా పేరొందిన విప్లవకవి, సమర శీలి.. గద్దర్‌కు మరింత సమున్నత గౌరవం దక్కేలా కీలక చర్యలకు నడుం బిగించారు. ఇప్పటికే ఆయన విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ట్యాంక్ బండ్‌పై గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. స్థలం చూడాలని కూడా సంబంధిత అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఆదేశించారు.
ఇక, ఇప్పుడు.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన కళాకారులకు ఏటా ఇచ్చే `నంది` అవార్డులను ఈ ఏడాది నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో నంది అవార్డులను ప్రకటించక పోవడం.. ఇవ్వకపో వడం కూడా తెలిసిందే. అయితే.. ఈ ఏడాది నుంచి సినీ, స్టేజ్, సహా భరత నాట్యం, కూచిపూడి, హరికథ, బుర్రకథ, తెలంగాణ సంప్రదాయ కళలకు సంబంధించిన ఉత్తమ కళాకారులకు ఈ అవార్డులు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. నంది అవార్డులకుసంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇక, ఈ నంది అవార్డుల పేరును కూడా మార్చాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. నంది పేరును తీసేసి.. ఈ స్థానంలో ప్రముఖ కళాకారుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన.. కవి.. గద్దర్పేరును పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అయితే..దీనిని కేబినెట్లో పెట్టి ఆమోదం తీసుకుని.. తర్వాత.. సభలోనూ చర్చించి గవర్నర్‌కు పంపించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కూడా విజయవంతంగా ముగించాలని రేవంత్ నిర్ణయించారు. సభలో ఎవరూ కూడాగద్దర్ పేరును కాదనేవారు ఉండకపోవడం గమనార్హం. దీంతో రేవంత్ నిర్ణయం దాదాపు అమలవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆరు నుంచి సమావేశాలు..
తెలంగాణ అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు.. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. మొత్తం ఆరు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశ పెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తెలంగాణకు జరిగే కేటాయింపులను భేరీజు వేసుకుని..తదనుగుణంగా తెలంగాణ బడ్జెట్‌కు రూపకల్పన చేయనున్నారు.