డీజీపీ గారూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి! అంటూ.. ఏపీ డీజీపీ కె.వి. రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధి నేత, మాజీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రం తగలబడి పోతున్నా.. నీరో చక్రవర్తిని తలపించేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమై పోయాయని అన్నారు. ఎక్కడ చూసినా.. ఎందు వెదికినా.. వైసీపీ నాయకులు రౌడీయిజమే కనిపిస్తోందన్నారు. మీ హయాంలో వ్యవస్థలు ఎలా భ్రష్టు పట్టిపోయాయో.. రౌడీ యిజం, గూండాయిజం ఎలా ప్రబలి పోయిందో చెప్పడానికి ఇదేఉదాహరణ అంటూ.. మండిపడ్డారు.
ఈ క్రమంలో చంద్రబాబు కొన్ని ఉదాహరణలు చూపించారు. వీటికి సమాధానం చెప్పడం కాదు.. ఆయా వ్యక్తులు అలా బరితెగించినందుకు వారిని అరెస్టు చేయకుండా.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి.. అరెస్టు చేయాలని అనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్, క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం పూర్తిగా గాడి తప్పిన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
మార్టూరులో మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండా రాజ్‌కు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. గుంటూరు జిల్లా క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు వందల మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా.. పోలీసులు సహకరించినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు.
డీజీపీ స్థాయిలో ఉండి.. వీటిని కనీసం పర్యవేక్షించి కట్టడి చేయకపోగా.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం దారుణమని చంద్రబాబు అన్నారు. డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయలేని అధికారులు యూనిఫాం తీసేసి.. వైసీపీలో చేరాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.