ఈసారి వేసవ సందడికి తెర తీస్తుందని అనుకున్నా భారీ చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కావాల్సింది. కానీ ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ గాయపడటం వల్ల షూటింగ్ జాప్యం జరగడంతో వేసవి రేసు నుంచి తప్పుకోవాలని దేవర టీం భావిస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై దేవర చిత్ర బృందం మౌనం వహిస్తుండడంతో దేవర వాయిదా పడినట్లే భావిస్తున్నారు.
ఆ స్థానంలోకి విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ వస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయమై ఫ్యామిలీ స్టార్ నిర్మాత దిల్ రాజు స్వయంగా స్పందించాడు. దేవర ఏప్రిల్ 5న విడుదల కాకపోతే ఆ రోజు తమ చిత్రం ఫ్యామిలీ స్టార్ ను రిలీజ్ చేస్తామని ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 9న ఈగల్ సినిమాకు పోటీగా రావాల్సిన ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని వాయిదా వేయించిన నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దిల్ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.
పనిలో పనిగా సంక్రాంతి సమయంలో ఎదురయ్యే పోటీ, థియేటర్ల కేటాయింపుకి సంబంధించి జరిగే గొడవల ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి అన్నాక ప్రతిసారి ఈ గొడవ తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ టైంలో ప్రతి సినిమాకు మైలేజ్ వస్తుందని.. మీడియాలో కూడా ఆ సినిమాల గురించి ఎక్కువ చర్చ జరుగుతుందని.. అందుకే ప్రతి ఒక్కరు సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని చూస్తారని ఆయన అన్నారు. వచ్చేసారి తన ప్రొడక్షన్ నుంచి సంక్రాంతి సినిమా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికి తాను ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉండను కాబట్టి మీడియాకు దొరకనని రాజు వ్యాఖ్యానించడం విశేషం.