అగ్రరాజ్యం అమెకాలో ఎన్నికల సమయం చేరువ అవుతున్న నేపథ్యానికితోడు.. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు.. దేశ రాజకీయాలను వేడెక్కించాయి. తాజాగా జోర్డాన్ దాడులతో అమెరికా సైనికులు మరణించిన ఘటన మరింత మంటలు రేపుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మాజీ అధ్యక్షుడు, ఫైర్‌బ్రాండ్ డొనాల్డ్ ట్రంప్ మరింత విరుచుకుపడ్డారు. అధ్యక్షుడు బైడెన్ పై విరుచుకుపడ్డారు. `బైడెన్ వేస్ట్ ఫెలో“ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏం జరిగింది?
అమెరికాపై కాలు దువ్వుతున్న జోర్డాన్.. తాజాగా డ్రోన్ దాడులు చేసింది. అది కూడా అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయడంతో ఈ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాలో తీవ్రస్థాయిలో కలకలం రేపింది. దీనిపై స్పందించిన అధ్యక్షుడు బైడెన్.. అంతకంత బదులు తీర్చుకుంటామని జోర్డాన్‌ను హెచ్చరించారు. అయితే.. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా.. రాజకీయ దుమారాన్ని మాత్రం ఆయన నిలువరించలేక పోయారు.
ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు డొనాల్డ్ ట్రంప్ దీనిని తనకు అందివచ్చిన అవకాశంగా మార్చుకుని బైడెన్‌ను కార్నర్ చేశారు. “ఇదో భయంకరమైన రోజు అన్నారు. బైడెన్ వేస్ట్ ఫెలో. విదేశీ విధానంపై ఆయనకు పట్టులేదు. అమెరికాను బలహీనంగా మార్చేశాడు. నేనే అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. ఇలాంటి ఘటనలు జరిగేవి కాదు. మనం మూడో ప్రపంచ యుద్ధం అంచున ఉన్నాం“ అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ఇదేసమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. బైడెన్ చేతకాని తనం వల్లే ఈ యుద్దం ఇంకా కొనసాగుతోందని.. అదే తాను ఉండి ఉంటే.. ఎప్పుడో ఆగిపోయేదని.. అసలు యుద్ధం అన్న మాటే ఉండేది కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను పదవి నుంచి దిగిపోయే సమయానికి ఇరాన్ చాలా బలహీనంగా ఉండేదన్నారు. కానీ, బైడెన్ వచ్చిన తర్వాత ఆ దేశానికి వేలకోట్ల డాలర్లు వెళ్తున్నాయని, తద్వారా రక్తపాతానికి కారణమవుతోందని ఆరోపించారు.