టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని గల్లా చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపుతోంది. ఈ ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడిన గల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, తనను రాజకీయాలు మార్చలేవని, కానీ, తాను రాజకీయాలను మార్చాలనుకుంటున్నానని చెప్పారు.
అయితే, రాజకీయాలు..వ్యాపారం రెండిటిని ఒకేసారి మేనేజ్ చేయడం కష్టమవుతుందని చెప్పారు. అందుకే ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా ఉండలేనని గల్లా జయదేవ్ అన్నారు. 10 సంవత్సరాల పాటు నిజాయితీగా రాజకీయాలు చేశానని అన్నారు. రాజకీయాలకు బ్రేక్ ఇచ్చినా టీడీపీలో కొనసాగుతానని గల్లా చెప్పుకొచ్చారు. ఒకవేళ తన రాజకీయ వనవాసం పూర్తయితే మళ్లీ రాజకీయాలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించానని చెప్పుకొచ్చారు. పదేళ్ల నుండి హోదా కోసం పోరాడిన ఫలితం లేదన్నారు. వ్యాపారుల మీద ప్రభుత్వాలు కక్షకట్టకూడదని పరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గల్లా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న తనను ఇబ్బంది పెట్టి, తన వ్యాపారాలు దెబ్బతీయాలని చూసినా తను భయపడలేదని అన్నారు. రాజకీయ నాయకుడిగా ఉండటంవల్ల తన వ్యాపారాల మీద ఆ ప్రభావం పడుతుందని, దానివల్ల తన వ్యాపారాలపై ఆధారపడ్డ వాళ్లకు న్యాయం చేయలేకపోతున్నానని గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు.