అతిధిగా వచ్చి.. భారత విద్యార్థులకు తియ్యటి మాట చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
గణతంత్ర వేడుకలకు భారత దేశ అతిధిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ నోటినుంచి తీపి కబురు వచ్చింది. తన పర్యటనలో భాగంగా ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారత విద్యార్థులకు ఒక తీపి కబురు చెప్పారు. తమ దేశానికి భారత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు రావాలంటూ ఆయన ఆహ్వానించారు.
2030 నాటికి ఫ్రాన్స్ విశ్వవిద్యాలయాల్లో 30వేల మంది భారతీయ విద్యార్థుల్ని చేర్చుకోవటమే తమ లక్ష్యమన్న ఆయన.. ఈ గొప్ప లక్ష్యం రెండేళ్లలో పూర్తి చేసే మరింత బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఆసక్తికరంగా చెప్పాలి. ఇరు దేశాల మధ్య విద్యాపరమైన బంధం మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్న ఆయన.. ఫ్రెంచ్ ఫర్ ఆల్.. ఫ్రెంచ్ ఫర్ బెటర్ ఫ్యూచర్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకోవటానికి కొత్త మార్గాల్ని ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఫ్రెంచ్ నేర్పించే కేంద్రాలతో ఒక నెట్ వర్కును కూడా ఏర్పాటు చేస్తామన్న ఆయన.. ఫ్రెంచ్ రాని అంతర్జాతీయ విద్యార్థులకు అనుకూలంగా తమ దేశంలోని వర్సిటీల్లో అంతర్జాతీయ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
అంతేకాదు.. ఫ్రాన్స్ లో చదువుకున్న భారతీయులకు త్వరగా వీసా లభించేలా విధానాన్ని చేపడతామన్న ఆయన.. ఈ తీపికబురును తనకు తానుగా చెప్పటం విశేషం. ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా.. సదరు రిపోర్టర్ అడుగున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ఆయన.. తాను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నట్లుగా పేర్కొంటూ.. భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఫ్రాన్స్ లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటూ.. అక్కడ జాబ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు అతిధిగా వచ్చిన మాక్రాన్.. భారత యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించారని చెప్పాలి.