రాబోయే ఎన్నికలలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జనసేన-టీడీపీలో కొందరు నాయకులతో ఉమ్మడిగా సమన్వయ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లో చంద్రబాబుతో కలిసి కొన్ని బహిరంగ సభలలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు జరుగుతున్నాయని, మరికొద్ది రోజుల్లోనే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అన్న విషయంపై చంద్రబాబు, పవన్ తుది నిర్ణయానికి వస్తారని టాక్ వస్తుంది.
ఈ క్రమంలోనే అరకు స్థానంతో పాటు మరో స్థానాన్ని స్థానంలో టీడీపీ అభ్యర్థుల పోటీ చేస్తారని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. అయితే, తనకు మాట మాత్రం చెప్పకుండా సీట్లను ప్రకటించడంపై పవన్ హర్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తాము కూడా రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నామని పవన్ సంచలన ప్రకటన చేశారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపుతోంది. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉన్న విధంగానే తనపై కూడా ఒత్తిడి ఉంటుందని, ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని పవన్ చెప్పారు.
ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను ఈ రెండు సీట్లు ప్రకటించానని పవన్ చెప్పుకొచ్చారు. అయితే, సీట్ల పంపకాల విషయంలో కొందరు తనకు సలహాలు ఇస్తున్నారని, 50 తీసుకోవాలని, 60 తీసుకోవాలని చెబుతున్నారని పవన్ అన్నారు. అయితే మూడో వంతు సీట్లను జనసేన తీసుకోబోతుందని, సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పవన్ చెప్పుకొచ్చారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు వస్తాయేమో గాని అధికారంలోకి రాలేమని పవన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోనే టీడీపీతో పొత్తు అయిపోదని, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని పవన్ చెప్పారు. పొత్తులలో భాగంగా ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని, అది తెలియకుండానే ఈ స్థాయి వరకు వచ్చానా అని పవన్ ప్రశ్నించారు.
చంద్రబాబు సీఎం అభ్యర్థి అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోలేదని పవన్ అన్నారు. సీనియర్ నేత, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి అటువంటివి జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదని, కానీ 2024 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదని పవన్ చెప్పారు. అయితే, గతంలో చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించడం, దానికి బదులుగా పవన్ ఇప్పుడు రెండు సీట్లు ప్రకటించడం టీడీపీ-జనసేన పొత్తుకు తూట్లు పొడిచేలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 2 పార్టీల మధ్య సీట్ల పంపకం వ్యవహారం త్వరగా తేలితేనే బెటర్ అని లేకపోతే క్యాడర్ అయోమయానికి గురై పొత్తు చిత్తయ్యే అవకాశం ఉందని టీడీపీ, జనసేన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.