ఐదేళ్ల కిందట ఆర్ఆర్ఆర్ సినిమాను అనౌన్స్ చేయడం ఆలస్యం.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఎవరిది పైచేయి అనే విషయంలో ఇరు వర్గాల అభిమానుల్లో చర్చలు, వాదోపవాదాలు మొదలయ్యాయి. సినిమా నుంచి ఇద్దరు హీరోలకు సంబంధించిన లుక్స్, టీజర్లు, ఇతర ప్రోమోలు రిలీజైన ప్రతిసారీ తారక్, చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ కొట్టేసుకున్నారు. ఇక సినిమా రిలీజయ్యాక అయితే ఈ గొడవలు మరో స్థాయికి వెళ్లాయి.
రామ్ చరణ్ ఇంట్రో ముందు తారక్ ఆరంభ సన్నివేశం తేలిపోయిందని చరణ్ అభిమానులంటే.. ఇంటర్వెల్, కొమరం భీముడో పాటలో ఎన్టీఆర్ హైలైట్ కావడం గురించి తారక్ ఫ్యాన్స్ తొడగొట్టారు. మొత్తంలో పాత్రల ప్రాధాన్యం, ఇంపాక్ట్ విషయంలో నెలల తరబడి గొడవలు పడ్డారు ఇరు వర్గాల అభిమానులు. ఈ దెబ్బతో మళ్లీ పెద్ద స్టార్లతో మల్టీస్టారర్లు చేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆర్ఆర్ఆర్ రిలీజై రెండేళ్లు కావస్తున్నా కూడా ఈ మంటలు చల్లారలేదు. ఇప్పుడు మళ్లీ రాజమౌళి తండ్రి, ఆర్ఆర్ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తారక్, చరణ్ అభిమానుల మధ్య మళ్లీ గొడవ రాజుకోవడానికి కారణమైంది. ఈ సినిమాలో పాత్రలు రాసేటపుడు ఒకరికి ఎక్కువ ప్రాధాన్యం, ఒకరికి తక్కువ అని ఆలోచించలేదని.. కానీ రైటింగ్ పూర్తయ్యాక మాత్రం చరణ్ చేసిన సీతారామరాజు పాత్రకు ఎక్కువ బలమైందిగా అనిపించిందని.. భీమ్ది సహాయ పాత్ర తరహా అని ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
ఈ వ్యాఖ్యలకు తారక్ ఫ్యాన్స్ బాగా హర్టయి విజయేంద్రను ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో విజయేంద్ర వీడియో, వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న చరణ్ అభిమానులతోనూ వాదోపవాదాలు నడుస్తున్నాయి. సినిమా రిలీజైన రెండేళ్ల తర్వాత కూడా తారక్, చరణ్ అభిమానులు ఇలా గొడవ పడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.