కేసీఆర్ కు మంగళవారం పెద్ద షాకే తగిలింది. పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్ఏలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మర్యాదకోసమే వీళ్ళు నలుగురు రేవంత్ తో భేటీ అయ్యారా లేకపోతే ఏదైనా వ్యూహముందా అన్నదే అంతుచిక్కటంలేదు. విషయం ఏదైనా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ముఖ్యమంత్రి భేటీ అవటం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోందన్నది వాస్తవం. పైగా నలుగురు ఎంఎల్ఏలు కూడా కేసీయార్ సొంతజిల్లా మెదక్ కు చెందిన వాళ్ళే కావటం గమనార్హం.
దుబ్బాక ఎంఎల్ఏ కొత్తా ప్రభాకరరెడ్డి, నర్సాపూర్ ఎంఎల్ఏ సునీతా లక్ష్మారెడ్డి, పటాన్ చెరు ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎంఎల్ఏ మాణిక్ రావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుమాసాల్లో కూలిపోతుందని, తాము తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని కేటీయార్, హరీష్ ప్రతిరోజు శాపనార్ధాలు పెడుతున్నారు, గోలచేస్తున్నారు. ఇదే సమయంలో తమపార్టీకే చెందిన నలుగురు ఎంఎల్ఏలు రేవంత్ ను కలవటాన్ని కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు తట్టుకోలేకపోతున్నారు.
బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఎవరూ ముఖ్యమంత్రిని కలవకూడదని పార్టీ ఇప్పటికే ఆదేశాలను జారీచేసినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రిని కలిసే ప్రతి ఎంఎల్ఏ కూడా తన నియోజకవర్గం అభివృద్ధికి నిధుల మంజూరు కోసమే అని చెప్పటం అందరికీ తెలిసిందే. అధికారపూర్వక భేటీనే అయితే సెక్రటేరియట్ లో కాకుండా రేవంత్ ఇంట్లో ఎందుకు కలిశారన్నదే అర్ధంకావటంలేదు. రేవంత్ ను సెక్రటేరియట్ లో కలిసినా, ఇంట్లో కలిసినా పెద్ద తేడా ఏముండదు. కాకపోతే సెక్రటేరియల్ లో కలిస్తే మరో పదిమంది నేతలను తీసుకుని కలవచ్చన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. ఇంట్లో అయితే అంతమందిని ఎలౌ చేయరు. కాబట్టి ఎంఎల్ఏలు మాత్రమే కలిసే అవకాశాలుంటాయి.
ముఖ్యమంత్రిని కలిసినపుడు ఎంఎల్ఏలు ఏమి మాట్లాడుకుంటారో మూడోవ్యక్తికి తెలిసే అవకాశంలేదు. అందుకనే ఇంట్లో కలిసిన నలుగురు ఎంఎల్ఏలమీద పార్టీలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏమిటంటే నలుగురు ఎంఎల్ఏలు రేవంత్ ను కలిసేంతవరకు విషయం బయటకు పొక్కలేదు. ఎంఎల్ఏలు అటు ఇటు జంప్ చేయటం చాలా మామూలైపోయింది. దీనికి ఆధ్యుడు కేసీయారే అని చెప్పటంలో సందేహంలేదు. తాను నేర్పించిన విద్యనే ఇపుడు రేవంత్ ప్రయోగిస్తున్నారనే టాక్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.