కీలక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ.. తగిన జాగ్రత్తలుతీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వేళలో ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఓపికకు.. సహనానికి పరీక్ష పెట్టేలా కొందరు వ్యవహరిస్తుంటారు. ఇలాంటి వారి విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలే తప్పించి.. ఆవేశానికి గురై నోరు జారితే.. ప్రత్యర్థులు విసిరిన వివాదాల ఉచ్చులో చిక్కుకుపోతామన్న విషయాన్ని గుర్తించాలి.
తాజాగా వెలుగు చూసిన ఉదంతంలో ఇలాంటి వ్యవహారంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బ్యాలెన్స్ మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. తాజాగా కొందరు మీడియా ప్రతినిధులపై ఆయన ఫైర్ అయిన ఉదంతం సంచలనంగా మారింది. తిరుపతి పట్టణంలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా మీడియా ప్రతినిధులకు చెవిరెడ్డి సమాచారం అందించినట్లుగా చెబుతున్నారు. అక్కడకు వెళ్లిన పదిహేను మంది జర్నలిస్టులను తన ఇంటికి రావాలని కోరినట్లుగా చెబుతున్నారు.
అక్కడకు వెళ్లిన వారికి.. ఊహించని పరిణామాలు ఎదురైనట్లుగా తెలుస్తోంది. తనపై తప్పుడు వార్తలు రాశారని.. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్న వైనంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనపైన.. తన కొడుకు పైనా తప్పుడు వార్తలు రాసింది ఎవడ్రా అంటూ గద్దించటమే కాదు.. సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
‘మీ ఇళ్లకు వచ్చి మీ ఇంట్లో వాళ్ల ముందే కాళ్లు.. చేతులు విరుస్తా. ఏడేళ్లు నక్సలైట్ గా ని చేసి వచ్చా. నా మీదా.. నా కొడుకు మీదా తప్పుడు మెసేజ్ లు పెడితే ఊరుకోను’’ అంటూ తీవ్ర స్వరంగా మందలించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయన్న చెవిరెడ్డి.. ‘‘తలకిందులుగా వేలాడదీసి చర్మం వలుస్తా. దీని కోసం కొన్ని టీంలు ఏర్పాటు చేస్తున్నా’’ అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా కొందరు విలేకరుల పేర్లను ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
అయితే.. దీనిపై మిగిలిన కొందరు మాట్లాడే ప్రయత్నం చేయగా.. వారిని అక్కడే వదిలేసి.. కొడుకును తీసుకొని వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఉదంతం స్థానిక మీడియా వర్గాల్లోనూ.. పార్టీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తప్పుడు పనులు చేసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఇలా నోటికి పని చెప్పకుండా ఉండాల్సిందన్న మాట వినిపిస్తోంది.