వైఎస్ షర్మిల వ్యూహాలు ఎలా ఉంటాయన్నది పక్కనపెడితే ఆమె నోరు మాత్రం చాలా పవర్ఫుల్ అనేది కాదనలేని సత్యం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల అలా బాధ్యతలు చేపట్టారో లేదో ఇలా తన నోటికి పదును పెట్టారు.
ఆమె తన అన్న, ఏపీ సీఎం జగన్‌ను విమర్శిస్తారా లేదా అని సగటు ప్రజలు చూస్తున్నారు.
అయితే, ఆమె తన తొలి స్పీచ్‌లో జగన్‌పై పదునైన విమర్శలు చేశారు.
వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయని ప్రశ్నించిన ఆమె మణిపూర్‌లో 2 వేల చర్చిల మీద దాడులు చేసి, 60 వేల మంది క్రిస్టియన్లు నిరాశ్రయులు కావడానికి కారణమైన బీజేపీని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారామె.
జగన్ ఒక క్రైస్తవుడు అయ్యుండి అంతమంది మనుషులు చచ్చిపోతుంటే ఒక్కసారి కూడా మణిపూర్ విషయం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
మనుషులు చచ్చిపోతున్నా నువ్వు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నావంటే నువ్వు మనిషివా కాదా అని ఆమె నేరుగా విమర్శలు చేశారు.
అంతేకాదు… ఏపీలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి అనేది కనిపించడం లేదన్నారామె.
రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా అప్పులపాలు చేశాడంటూ తన అన్నపై విరుచుకుపడ్డారు షర్మిల.
రోడ్లు వేయడం కూడా జగన్ కు చేతకావడం లేదన్నట్లుగా ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
షర్మిల ఇలా తన అన్నను ధీటుగా టార్గెట్ చేయడంతో ఇది ఆరంభశూరత్వమా లేదంటే ఎన్నికల వరకు ఆమె ఇదే
జోరు కొనసాగిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా షర్మిల విమర్శల తరువాత వైసీపీ శిబిరంలో ఒక్కసారిగా షాక్ కనిపిస్తోంది.
షర్మిల జగన్‌కు సొంత చెల్లెలు కావడంతో సాధారణ నాయకులు ఎవరూ ఆమెకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి షర్మిలపై విమర్శలు చేశారు.
జగన్ చెల్లెలుగా షర్మిల అంటే తమకు గౌరవం అంటూనే ఆమె చంద్రబాబు వ్యూహంలో చిక్కుకున్నారంటూ విమర్శలు చేశారు.
అయితే.. సజ్జల విమర్శలలో పదును కనిపించలేదు.
చంద్రబాబునో, పవన్ కల్యాన్ పైనో విమర్శలు చేసినప్పుడు ఉండే స్పీడు సజ్జలలో కనిపించలేదు.
షర్మిల ప్రభావం తమకు కచ్చితంగా నష్టం కలిగిస్తుందన్న భయం వైసీపీలో కనిపిస్తోంది ఇప్పుడు.