సినిమాలకు సంబంధించి సమాచారం, టాక్ జనాల్లోకి వెళ్లడంలో.. సినిమాలకు బజ్ తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకం. మీడియా వాళ్ళు లేకుంటే జనాలకు సినిమాల గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఈ రోజుల్లో సోషల్ మీడియా పాత్ర పెరిగినప్పటికీ దాన్ని నమ్ముకుని సినిమాను ప్రమోట్ చేయడం అన్నది సాధ్యం కాదు.
ప్రేక్షకులు ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా మీద ఎంతగా ఆధారపడతారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల రివ్యూలు, కలెక్షన్ల గురించి మీడియా ఇచ్చే సమాచారం వల్ల కొంత డ్యామేజ్ జరిగే మాట వాస్తవమే కానీ.. దాంతో పోలిస్తే సినిమాకు జరిగే లాభాలు ఎక్కువ. ఈ విషయం తెలిసి కూడా ఈమధ్య టాలీవుడ్ జనాలు మీడియాను టార్గెట్ చేయడం రివాజుగా మారింది.
కేవలం ఇన్నాళ్లు కేవలం రివ్యూలు, ఇతర వార్తల విషయంలోనే మీడియాను టార్గెట్ చేసేవాళ్లు ఫిలిం మేకర్స్. కానీ ఇప్పుడు కొత్తగా కలెక్షన్ల రిపోర్టులను కూడా తప్పుబడుతూ చర్యలకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుంటూరు కారం సినిమాకు సంబంధించి ప్రొడ్యూసర్లు ప్రకటిస్తున్న కలెక్షన్లకు, మీడియాలో రిపోర్ట్ చేస్తున్న కలెక్షన్లకు అంతరం ఉండడంపై ఇప్పుడు వివాదం నెలకొంది. ఈ విషయమై నిర్మాత నాగ వంశీ ఫైర్ అయ్యాడు. కట్ చేస్తే తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘం తరఫున బాక్సాఫీస్ కలెక్షన్లను రిపోర్ట్ చేస్తే వెబ్ సైట్లకు నోటీసులు వెళ్లాయి.
ఈ కలెక్షన్ రిపోర్టులకు సోర్స్ ఏదని ప్రశ్నిస్తూ.. తప్పుడు కలెక్షన్లు ప్రకటిస్తే చర్యలు తప్పవని ఈ నోటీసుల్లో హెచ్చరించారు. అయితే నిర్మాతలు అయిన కాడికి కలెక్షన్లు పెంచి చూపించడం, ఫేక్ కలెక్షన్లతో పోస్టర్లు వేయడం రివాజుగా మారిన ఈ రోజుల్లో పనిగట్టుకుని కలెక్షన్ల విషయంలో మీడియాను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. నిర్మాతల ప్రకటించే కలెక్షన్ల విషయంలో మీడియా శూల శోధనకు దిగితే అసలుకే మోసం వచ్చి.. చివరికి సినిమా వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ వ్యవహారం ఇంతటితో అభిప్రాయం వ్యక్తం అవుతోంది.