చంద్రబాబు లాంటి నాయకుడిని కాదనుకుని గుడ్డిగా తనను నమ్మి జనం అయిదేళ్లు అవకాశం ఇస్తే పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేక ఇప్పటికే జనంలో పరువు పోగొట్టుకున్న ఏపీ సీఎం జగన్ కు మిగిలిన అంతోఇంతో పరువును కూడా చంద్రబాబు తీసేస్తున్నారు.
జగన్ చేసిన ఒక్కో వెధవ పనిని బయటపెట్టి జనాలకు ఆయన నిజ స్వరూపం చెప్పి చైతన్యం కలిగిస్తున్నారు.
2019 ఎన్నికలలో ఏపీలోని మైదాన ప్రాంత ప్రజలను మోసం చేసినట్లే అమాయక గిరిజనాన్ని కూడా జగన్ తన మాయమాటలతో మోసం చేసి ఓట్లు తీసుకున్నారు.
జగన్ కు ఓట్లేసిన పాపానికి ఇప్పుడు మన్యం ప్రాంతమంతా గంజాయి కంపు కొడుతోంది. అయిదేళ్ల కిందట వరకు పొద్దున్న లేచి బుద్దిగా తమ పని తాము చేసుకుని పిల్లాపాపలతో హాయిగా బతికిన గిరిజనం ఇప్పుడు గంజాయి కేసులలో జైళ్లకు వెళ్తున్నారు.
ఏమీ తెలియని తమతో తప్పులు చేయించి వైసీపీ నాయకులు, గంజాయి వ్యాపారులు లాభపడుతుంటే తాము మాత్రం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, లాఠీ దెబ్బలు తింటూ కష్టాలు పడుతున్నామంటున్నారు.
తాజాగా చంద్రబాబు కూడా గిరిజనులకు అదే విషయం చెప్పారు. వారు ఏం నష్టపోయారో.. ఎలా నష్టపోయారో వారికి వివరించారు. ఇకనైనా మేలుకుని చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు.
టీడీపీ అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేస్తే, వైసీపీ గంజాయిని పరిచయం చేసిందని చంద్రబాబు విమర్శించారు. శనివారం అల్లూరి జిల్లా అరకులో ‘రా…కదలి రా’ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని విమర్శించారు. అరకు ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయమని, ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు.
అరకు కాఫీ అనే పేరు తానే పెట్టానని చంద్రబాబు అన్నారు. 80 రోజుల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగుతుందన్నారు. మహిళల పట్ల కనికరం లేకుండా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందో అర్థం కావడం లేదన్నారు.
టీడీపీ ప్రభుత్వం రాగానే పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లాను ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పోలవరం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి జిల్లాలో ఉంది. ఈ ప్రాంత గిరిజనులు జిల్లా కేంద్రానికి రావాలంటే కనీసం 200 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని, అందుకే గిరిజనుల డిమాండ్ మేరకు జిల్లా ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
వైసీపీ గిరిజనుల పొట్టకొడుతుందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని గతంలో జీవో నెంబర్ 3 ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసిందన్నారు.
జీవో నెంబర్ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
గిరిజనుల కోసం టీడీపీ ప్రభుత్వం 16 పథకాలు అమలు చేసిందని, వాటిని సీఎం జగన్ రద్దు చేశారని చంద్రబాబు ఆరోపించారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం వైసీపీకి ఇష్టం లేదని, అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని రద్దు చేశారని దుయ్యబట్టారు.
విద్యార్థుల నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే వాటిని తొలగించారన్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చామన్నారు.