డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ‘రా కదలిరా’ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు…ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దళితులకు తానేదో చేశానని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ, జగన్ పాలనలో రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైపోయిందని విమర్శించారు.
జగన్ ఒక పెద్ద పెత్తందారు అని, ఎవరూ మాట్లాడ్డానికి వీల్లేదని, దళితులు నోరెత్తకూడదని, ప్రశ్నించకూడదని, నిలబడకూడదని చెప్పారు. ఎవరైనా నోరు విప్పితే వారిపై దాడులు, గొంతు నొక్కే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారని దుయ్యబట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో దళితులపై 6 వేలకు పైగా దాడులు జరిగాయని, 188 మంది దళితులు హత్యకు గురయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కోడికత్తి డ్రామా ఆడి గత ఎన్నికల్లో సానుభూతితో గెలిచారని, పెద్ద తప్పు చేయని కోడికత్తి శ్రీనివాస్ ఐదేళ్లుగా జైల్లో ఉన్నాడని, బాబాయ్ ని చంపినవాడు మాత్రం బయట తిరుగుతున్నాడని అవినాష్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ ఊరేగింపుగా బయట తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. దళితులను, దళితుల పథకాలను ఓ పథకం ప్రకారం నాశనం చేసిన జగన్ ఈ రోజు అంబేద్కర్ విగ్రహం పెట్టి దళితులను ఉద్ధరిస్తానంటున్నాడని, సామాజిక న్యాయం చేస్తానంటూ జగన్ వెళితే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు.
దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. అంబేద్కర్ కు భారతరత్న వచ్చింది ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడేనని గుర్తు చేశారు. కోనసీమ ప్రాంతానికి చెందిన బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా నామినేట్ చేసింది తమ పార్టీ అని, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నామినేట్ చేశామని గుర్తు చేశారు. జగన్ దళిత వ్యతిరేకి అని, దళితుల కోసం టీడీపీ తెచ్చిన 27 పథకాలను రద్దు చేశాడని గుర్తు చేశారు.