“ఏపీలో 2019కి ముందు ఉన్న పరిస్థితి ఎన్నికల తర్వాత మారిపోయింది. జగన్ అధికారం చేపట్టిన తర్వా త.. మాఫియా పెరిగిపోయింది. మాఫియా గ్యాంగులు విజృంభించాయి. చాలా రోజులు వేచి చూశా. కానీ, భరించే పరిస్థితి లేక పోవడంతో నేరుగా ఈ విషయాన్ని ఆయనకే చెప్పా. ఇదే నేను చేసిన తప్పు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడమే నేను చేసిన ద్రోహం. అందుకే నాపై కక్షగట్టారు. నన్ను దూరం పెట్టారు. చివరకు నన్ను గెంటేశారు“ అని వెంకటగిరి ఎమ్మెల్యే, వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రా.. కదలిరా! సభలో ఆనం పాల్గొ న్నారు. చంద్రబాబు సమక్షంలో కొందరు అనుచరులను ఆయన పార్టీలో చేర్పించారు. అనంతరం ఆనం మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో మాఫియాకు అడ్డుకట్ట పడలేదన్నారు. దీనిపై తాను తొలి రోజుల నుంచి హెచ్చరిస్తున్నానని చెప్పారు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా గ్రావెల్ మాఫియాలతో నాయకులు రెచ్చిపోతున్నారని.. వీరి నుంచివాటాలు ఎవరో పెద్దలకు అందుతున్నాయన్న సమాచారం ఉందన్నారు.
ఇవి ప్రస్తావించినందుకే తనపై వేటు వేశారని వ్యాఖ్యానించారు. అందుకే ఇమడలేక తాను బయటకు వచ్చానన్నారు. వెంకటగిరి అభివృద్దికి వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కనీసం చిన్నపాటి రోడ్డు వేద్దామన్నా.. నిధులు ఇవ్వలేదని తెలిపారు. కానీ, పంచాయతీల నుంచి నిధులను ప్రభుత్వమే వాడుకుంటోందని.. కేంద్రం ఇస్తున్న సొమ్ము ఏమైపోతోందో కూడా చెప్పడం లేదని అన్నారు. పైగా అప్పులు తెస్తున్నారని. ఇంత నిదులు వచ్చినా.. నియోజకవర్గాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు.