ఏపీ సీఎం జగన్ పై కోడికత్తి తో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ గత నాలుగేళ్లుగా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎన్ఐఏ కోర్టును కొంతకాలం క్రితం అభ్యర్థించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, శ్రీనివాస్ కు ఇచ్చిన బెయిల్ ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీంతో, ఇటీవల విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో మరోసారి బెయిల్ కోసం శ్రీను దరఖాస్తు చేసుకోగా బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విచారణలో జాప్యానికి నిరసనగా జైల్లోనే నిరాహార దీక్ష చేపడతానని శ్రీను కొద్ది రోజుల క్రితం ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిరాహార దీక్షకు దిగారు. పోలీసుల అనుమతులు లేకపోవడంతో విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు.
తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేపడతామని, ఈ కేసులో కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని అన్నారు. మరోవైపు, విశాఖ జైల్లో నిరాహార దీక్ష చేపట్టేందుకు శ్రీను రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.