పవన్ రీఎంట్రీ..అదీ ఓ బాలీవుడ్ చిత్రం రీమేక్ తో..అది బాగా క్లాస్ ఫిల్మ్ కదా…తెలుగులో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ చేస్తే ఆడుతుందా..అమితాబ్ వంటి పెద్ద వయస్సు వ్యక్తి చేసిన పాత్రలో పవన్ సూటవుతాడా…అయినా ఆ సినిమా మల్టిప్లెక్స్ ఫిల్మ్ కదా..ఇలా బోలెడు డౌట్స్. అయితే తమిళంలో అజిత్ చేసి ఒప్పించాడా కదా అనే ధైర్యం. ఇలా అనేక సందేహాలు, అనుమానాలు మధ్య వకీల్ సాబ్ థియోటర్స్ లో దిగాడు. కరోనా టైమ్ లో కాలరెత్తి కలెక్షన్స్ కొల్లగొట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ నిర్మాతలు ధైర్యం చేసారు. ఫ్యాన్స్ ఉప్పెనలా వచ్చి పడ్డారు. ఈ నేపధ్యంలో సినిమా వాళ్ల ఎక్సపెక్టేషన్స్ కు ఏ మాత్రం దగ్గరగా లేకపోయినా అబ్బే అనేస్తారు. ఆ ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ అయ్యారా..పవన్ మ్యాజిక్ భాక్సాఫీస్ వద్ద మరోసారి వర్కవుట్ అయ్యిందా అనే విషయాలు చూద్దాం.
స్టోరీ
కథగా చూస్తే ఇది ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలు వేముల పల్లవి (నివేదా థామస్) ,జరీనా (అంజలి) దివ్య (అనన్య) కథ. వీళ్లు ముగ్గురూ మంచి ప్రెండ్స్. హైదరాబాద్ లో జాబ్స్ చేసుకుంటూ తమ కుటుంబాలకు సాయింగా ఉంటూంటారు. అయితే ఓ రోజు ఓ పార్టికి హాజరయ్యి క్యాబ్ లోఇంటికివెళ్తూ అది మధ్యలో బ్రేక్ డౌన్ అవటంతో ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో పడతారు. అప్పుడు ఎంపీ (ముఖేష్ రుషి) కొడుకు వంశీ(వంశీ) అటుగా కారులో వెళ్తూ…లిప్ట్ ఇస్తారు. వాళ్లతో రిసార్ట్స్ కు వెళ్తారు. అక్కడ వాళ్లు లైంగిక దాడికి గురి అవుతారు. దాని నుంచి తప్పించుకునే క్రమంలో వంశీపై చేతిలో ఉన్న బాటిల్ తో దాడి చేస్తుంది పల్లవి. దాంతో వంశీ కక్ష కడతాడు. ఆమెపై రివర్స్ లో కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాడు. ఆ ఎంపికు భయపడి ఏ లాయిరూ ఈ అమ్మాయిల తరుపున పోరాడటానికి ముందుకు రాడు. అప్పుడు వకీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్) సీన్ లోకి వస్తాడు. వాళ్లకోసం చాలా రోజుల క్రితం వదిలేసిన కోటుని వేసుకుని కోర్ట్ కు వెళ్తాడు. పవర్ ఫుల్ లాయర్ నందా (ప్రకాష్ రాజ్)ను ఎదుర్కొంటాడు. అసలు ఎవరీ సత్యదేవ్, అతని జీవితం ఏమిటి…ఈ కేసులో అతను ఎలా విజయం సాధించాడు..చివరకు కోర్ట్ తీర్పు ఏమి వచ్చింది..శృతిహాసన్ పాత్ర ఏమిటి వంటివిషయాలు సినిమాలో చూడాల్సిందే.
‘నో మీన్స్ నో..’
ఇక పింక్ సినిమాలో ‘నో మీన్స్ నో..’ అనే డైలాగు విన్నాక చాలా కాలం గుర్తుండిపోతుంది. ఆ డైలాగు ఎంతలా పాపులర్ అయ్యిందంటే..ప్రపంచ వ్యావహారిక డిక్షనరీ లో చేరింది. ఆ డైలాగు రాసేటప్పుడు తెలియదు…ఈ చిన్న డైలాగు ప్రపంచాన్ని కుదిపేస్తుందని…మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుందని. ఏముందా డైలాగులో ప్రత్యేకత అంటే… ఎంత సింపుల్ గా ..ఎంత ఎఫెక్టివ్ గా మాటలను మనస్సులోకి,మన ధృక్పదంలోకి ఎక్కించవచ్చో ఈ డైలాగు మనకో లెస్సన్ నేర్పుతుంది. యస్… హిందీ చిత్రం పింక్‌లో అమితాబ్ బచ్చన్, దాని తమిళ రీమేక్ నేర్కొండ పార్వై చిత్రంలోనూ అజిత్ చెప్పిన డైలాగ్ నో మీన్స్ నో. ఈ రోజు మన వకీల్ సాబ్ కూడా అదే డైలాగుని చెప్పి ఒప్పించారు. మహిళల విషయంలో నో అంటే చిన్న విషయం కాదని, అందులో చాలా భావం ఉందని స్ట్రాంగ్‌గా చెప్పారీ డైలాగుతో. ‘‘నో మీన్స్ నో’’ అంటూ.. రేప్ చేసేందుకు వచ్చిన వాడితో మై క్లైంట్ సెడ్ నో యువరానర్ అంటూ కోర్టులో లాయిర్ గా(అమితాబ్ బచ్చాన్) వాదించి విజయం సాధిస్తాడు. తెలుగులో పవన్ సైతం వద్దు అంటే అర్దం వద్దనే అని …ఖరాఖండిగా చెప్తూంటే విజిల్స్ వేయాలనిపిస్తుంది. ఎంతైనా మన భాషలో చెప్పిన డైలాగు కదా.
సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏం ఎక్సపెక్ట్ చేస్తాం..అదిరిపోయే డైలాగులు, చక్కటి రొమాన్స్ పార్ట్, కొద్దిపాటి ఫన్..కేక పెట్టించే పైట్స్ ..వగైరా..వగైరా..అయితే అవేమీ లేకుండా కేవలం ఓ సోషల్ మెసేజ్ ఎలిమెంట్ తో సినిమా మొత్తం తీస్తే చూడగలమా..అంటే మొదట నో చెప్పేస్తాం. కానీ ఈ సినిమా చూసాక ఖచ్చితంగా మన ఆలోచన మారుతుంది. పవన్ వంటి స్టార్ మాత్రమే ఇలాంటి సినిమాలు చేయగలరు..ఇంకా ఇలాంటివి చేయాలి అని అంటారు. అందుకు కారణం ఈ సినిమాలో డీల్ చేసిన సబ్జెక్ట్…ఆల్రెడీ పింక్ చూసిన వారికి ఇది చూసిన సబ్జెక్టే కదా అనిపించవచ్చు కానీ..తెలుగులో మొదటి సారి చూసిన వాళ్లు మాత్రం ఇది ఖచ్చితంగా ఆడవాళ్లు, ఆడవాళ్లను సపోర్ట్ చేసి, గౌరవించే మగవాళ్లు చూడాల్సిన సినిమా అనిపిస్తుంది.
స్క్రీన్ ప్లే సంగతులుకు వస్తే..ఫస్టాఫ్ ..పెద్దగా ఏమీ ఉండదు. హీరో పరిచయం, అతని గతం , చెప్పి అసలు కథలోకి వచ్చేసరికి ఇంట్రవెల్ వచ్చేస్తుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్ రూమ్ డ్రామా. అక్కడే కథా విశ్వరూపం కనపడుతుంది. కోర్ట్ లో కంటిన్యూగా జరిగే సన్నివేశాలను, ఆర్గ్యుమెంట్స్ ని ఎక్కడా బోర్ కొట్టకుండా లాక్కెళ్లటం పెద్ద పరీక్షే. అయితే ఎదురుగా ‘పింక్’, ‘నేర్కొండ పార్వాయ్’ ఉండటంతో ఆ ఇబ్బంది తెలియలేదు. మధ్యలో కొన్ని ఫైట్స్ పాటలు పెట్టుకుని, ప్రకాష్ రాజ్ ఫెరఫార్మెన్స్ ని అడ్డం పెట్టి సీన్స్ అలవోకగా లాక్కెళ్లిపోయారు.
అలాగే ఈ సినిమా విషయంలో కంటెంటే కింగ్ అనేది మరోసారి ప్రూవ్ అయ్యినట్లు అనిపిస్తుంది. కథలో మలుపులు ,ట్విస్ట్ లు లేకపోయినా ఓ పెయిన్ అండర్ కరెంట్ గా మనల్ని ఎంగేజ్ చేస్తూంటుంది. ఆ అమ్మాయిలకు న్యాయం జరిగేలా చూడు అని మనం మ్రొక్కుకునేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాడు దర్సకుడు. అది కలిసొచ్చింది. పవన్ కళ్యాణ్ పెద్దగా వేరియేషన్స్ లేని పాత్ర అయినా ఎమోషన్స్ ని అండర్ ప్లే చేస్తూ, ఒక్కోచోట ఆగ్రహాన్ని అగ్నిలా మండిస్తూ ముందుకు తీసుకెళ్లిపోయారు. టైటిల్ ప్రకారం ఇది క్యారక్టర్ డ్రైవర్ డ్రామాలా కనిపించినా ఇది ప్లాట్ డ్రైవన్ డ్రామానే. ఇలాంటి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ఎంచుకోవటం ఆశ్చర్యమే.
మెచ్చుకోదగినవి
పవన్ ఇంట్రో సీన్, సెకండాఫ్ లో ప్రకాష్ రాజ్ ని వాదనతో ఎదుర్కొనే సీన్స్
తమన్ ఇచ్చిన నేపధ్య సంగీతం
మెట్రో ట్రైన్ లో వచ్చే ఫైట్
నచ్చనవి
కథలో ఇమడకుండా కాలక్షేపానికి కూడా పనికిరాకుండా పోయిన ఫ్లాష్ బ్యాక్
ఎడిటింగ్
మరీ డ్రమటిక్ గా సినిమా టెక్ గా ఉన్న కోర్ట్ సీన్ డైలాగులు
ఇక సాంకేతిక విషయాలకు వస్తే దర్శకుడుగా వేణు శ్రీరామ్ ..స్క్రిప్టుని తెలుగుకు అనుగుణంగా రాసుకోవటంలోనే సగం సక్సెస్ అయ్యిపోయారు. పవన్ అభిమానులు కోరుకునే అంశాలను అందించాడు. అలాగే ఆర్టిస్ట్ ల నుంచి, టెక్నీషియన్స్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్న్రారు. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కెమెరా వర్క్. అలాగే ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ లో డామినేట్ చేసేది నివేదితా, పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ లు. వీరు ముగ్గరూ పోటీ పడి మరీ నటించారు.
చివరగా ఓ మా… ఈ సినిమా పవన్ అభిమానులకే కాదు సమాజం పట్ల కొంత ఆశావహ ధృక్పదం ఉన్నవాళ్లకు సైతం నచ్చుతుంది. కామెడీ, ఐటం సాంగ్ లు కోరుకుంటే మాత్రం పూర్తి నిరాశే.
రేటింగ్ : 3/5
సినిమా వివరాలు :
బ్యానర్ :శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
నటీనటులు: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల,ప్రకాష్ రాజ్ తదితరులు.
సంగీతం: ఎస్.ఎస్.తమన్,
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్,
ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
డైలాగ్స్: తిరు,
యాక్షన్ రవివర్మ,
వి.ఎఫ్.ఎక్స్: యుగంధర్,
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి,
సమర్పణ: బోనీ కపూర్,
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్ ,
దర్శకత్వం: శ్రీరామ్ వేణు
రన్ టైమ్:2 గంటల 35 నిమిషాలు
విడుదల తేదీ: ఏప్రిల్ 9, 2021