వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చా రా? తన ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చే వరకు తాడేపల్లి మొహం చూడకూడదని షరతు పెట్టుకున్నారా? అందుకే సంక్రాంతి పండగ ముందు సైతం.. ఆయన ఒంగోలు ఛాయలకు కూడా రాకుండా.. హైదరాబాద్ లోనే ఉండిపోయారా? అంటే.. ఔననే అంటున్నాడు ఆయన తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి.
తాజాగా మీడియాతో మాట్లాడిన ప్రణీత్‌రెడ్డి.. ఒంగోలులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో తన తండ్రి ఎందుకు కనిపించలేదో వివరించారు. తన సొంత నియోజకవర్గంలో 25 వేల మందికి జగనన్న ఇళ్లు నిర్మించి ఇస్తామని బాలినేని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే.. ఈ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదని.. దీనిపై తరచుగా సీఎం జగన్‌ను కోరుతున్నా స్పందించలేదని.. అందుకే ఈ హామీని నెరవేర్చే వరకు అటు తాడేపల్లి, ఇటు ఒంగోలులోనూ పర్యటించకూడదని తన తండ్రి షరతు పెట్టుకున్నారని ప్రణీత్ వివరించారు.
ఈ డిమాండ్ ప్రకారం.. 25 వేల ఇళ్ల నిర్మాణానికి దాదాపు 170 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇంత మొత్తం ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది? అనేది అసలు ప్రశ్న. వాస్తవానికి ఎప్పటి నుంచో బాలినేని ఈ ఇళ్ల కోసం పట్టుబడుతున్నారు. అయితే.. పార్టీలోని కొందరు నాయకులు దీనికి అడ్డు పడుతున్నారనేది చర్చగా మారింది. ఈ నిధులు ఇచ్చేసి.. 25 వేల ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఒంగోలులో బాలినేని హవాకు తిరుగు ఉండదని వారు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలినేని అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఇక, మరోవైపు.. బాలినేని దాదాపు నెల రోజులకు పైగానే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తనకు టికెట్ విషయంపైనా ఆయన స్పందించడం లేదు. అధిష్టానం కబురు పెట్టినా..ఇప్పటి వరకు స్పందిం చలేదు. దీంతో బాలినేని వ్యవహారం ఇప్పటి వరకు చర్చగానే మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.