మిగిలిన రోజులు ఎలా ఉన్నా.. పండగ వేళలో తమ రాజకీయాల్ని పక్కన పెట్టేసి.. ఎంచక్కా కుటుంబ సభ్యులతోనూ.. సన్నిహితులతోనూ ఎంజాయ్ చేస్తుంటారు రాజకీయ నేతలు. అంతుకు భిన్నంగా సంక్రాంతి సంబరాల పేరుతో తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన వేడుకల తీరు అవాక్కు అయ్యేలా చేసింది. తమను తాము గొప్పోళ్లుగా కీర్తించుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఆ మాటకు వస్తే.. ఎన్నికల వేళ ఆ ప్రయత్నాల్ని అర్థం చేసుకోవచ్చు.
కానీ.. వేడుకల పేరుతో నిర్వహించిన కార్యక్రమాల్లో విపక్ష నేతలపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటం.. వ్యక్తిగతంగా తూలనాడటం లాంటి విపరీత చర్యలకు వేదికగా మారటమే అసలు సమస్య. ఇలాంటి వేదిక మీద ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు.. ఆయన సతీమణి భారతి కూడా ఉండటం.. కళాకారుల అడ్డదిడ్డమైన మాటలకు చప్పట్లు కొడుతూ.. నవ్వుతూ ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
వేడుకల సందర్భంగా విజయలక్ష్మి అనే సింగర్ పాడిన పాటలో.. ప్రతిపక్ష పార్టీలను ఫాల్తు పార్టీలని వర్ణించటం ఒక ఎత్తు.. సిగ్గు.. ఎగ్గూ లేకుండా సీట్ల వెంట చూస్తున్నారంటూ ఏకంగా రాజకీయాలతో వేడుకల్ని మిక్స్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ పాటకు సీఎం సతీమణి భారతి చప్పట్లు కొట్టటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వేడుకల పేరుతో నిర్వహించే కార్యక్రమంలో విపక్షాల ప్రస్తావన తేకుండా ఉండాల్సి ఉంటే.. అందుకు భిన్నంగా వేడుకల్ని నిర్వహించిందే.. విపక్షాల్ని టార్గెట్ చేసేందుకన్న విషయం ప్రతి అంశంలోనూ కనిపించింది.
నీలకంఠ అనే మిమిక్రీ కళాకారుడైతే.. మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నేత వైఎస్ గొంతును.. స్వర్గీయ ఎన్టీఆర్ గొంతును అనుకరించే వేళలో.. జగన్ ను ఆకాశానికి ఎత్తేయటం ఒక ఎత్తు అయితే.. అదే గొంతుతో లక్ష్మీపార్వతి గొంతును అనుకరించి మాట్లాడుతూ.. జగన్ నవ్వుతుంటే ఎంత చక్కగా ఉంటుందో.. అదే నా అల్లుడు (చంద్రబాబు)ఎప్పుడైనా నవ్వాడా? అంటూ చేసిన వ్యాఖ్యల్ని చూసినోళ్ల నోటి నుంచి మాట రాని పరిస్థితి.
అదే సమయంలో చంద్రబాబు గొంతును అనుకరిస్తూ.. జగన్ ను కీర్తిస్తున్నట్లుగా మిమిక్రీ చేసిన వైనం చూస్తే.. ఇలాంటి ప్రోగ్రాం ఇంకెక్కడా చూడలేమన్నట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్వర్గీయ సినీ నటుడు శోభన్ బాబు గొంతును అనుకరించిన మిమిక్రీ కళాకారుడి నోటి నుంచి వచ్చిన మరో మాట.. ‘నా కంటే జగన్ అందగాడు’ అంటూ శోభన్ బాబు అంటున్నట్లుగా వ్యాఖ్యానించటం విశేషం. శోభన్ బాబు అందంతో మరెవరూ అప్పటికి ఇప్పటికి పోలిక పోల్చేందుకు సైతం సాహసించరు. ఆ పనిని ఈ వేడుకల్లో పూర్తి చేశారు.
చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ మీదన పలు విమర్శలు.. ఆరోపణల్ని చేస్తూ మిమిక్రీ ప్రోగ్రాంను చేయటం చూసినప్పుడు.. ప్రభుత్వ కార్యక్రమంలో ఈ రాజకీయాలేంటి? అది కూడా పండుగ వేళ అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ తరహా రాజకీయాలు మరెక్కడా కనిపించవని.. ఎక్కడో ఎందుకు? పక్కనున్న తెలంగాణలో ఇలాంటివి మచ్చుకు కూడా కనిపించవని.. ఏపీలో ఇదేం వైపరీత్యం అంటూ వ్యాఖ్యలు చేసుకోవటం కనిపిస్తోంది.