వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కు ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. సంక్రాంతి పండుగకు తన సొంతూరు వెళ్లేందుకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. 41ఏ సెక్షన్ తప్పనిసరిగా అనుసరించి రఘురామకు రక్షణ కల్పించాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు విచారణ సందర్భంగా ఇరువర్గాల తరఫు న్యాయవాదులు వాడీవేడి వాదనలు వినిపించారు. ఇప్పటికే రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో అక్రమ కేసు పెట్టి ఆయనను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించే అవకాశముందని రఘురామ తరఫు న్యాయవాదులు వాదించారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై గతంలో రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీంకోర్టు చొరవతో రఘురామ ఊరట పొందారు. కానీ, రఘురామ ఏపీకి వచ్చేందుకు కొన్నిసార్లు ప్రయత్నించినా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. రఘురామ ఏపీలో అడుగుపెడితే ఏదో ఒక కేసు పెట్టి అరెస్టు చేస్తారని టాక్ ఉంది. గతంలో ఒకసారి ఏపీకి వచ్చేందుకు రఘురామ ప్రయత్నించారు.
అయితే, కొన్ని పరిస్థితుల వల్ల హైదరాబాద్ లోనే ఆయన రైలు దిగి వెనక్కి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కనీసం ఈ ఏడాది సంక్రాంతి పండుగకు తన సొంతూరుకు వెళ్ళేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు రఘురామకు ఊరట కల్పించింది.