బీసీని కాబట్టే తనను తొక్కేశారంటూ.. అధికార వైసీపీపై పెనమలూరు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా పెనమలూరు వైసీపీ ఇంచార్జ్‌గా జోగి రమేష్‌ను పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన కొలుసు.. సీఎం జగన్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. బీసీని కాబట్టే తనను అవమానిం చారని, తాను ఏం తప్పు చేశానని ప్రశ్నించారు.
“ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే నా అసమర్థతా? వైసీపీలో బీసీలకు అగ్రతాంబూలం అని చెబుతున్న మాటలన్నీ.. నేతి బీరకాయలో నెయ్యి చందమే. జగన్ ముందు ఎవరూ నోరు ఎత్తడానికి వీల్లేదని.. ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు. ఆయన ముందు చేతులు కట్టుకోవాలని చెబుతారు. ఇదేనా మీరు బీసీలకు ఇచ్చే వాల్యూ“ అని వ్యాఖ్యానించారు.
తనను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారని.. కానీ, అక్కడ పార్టీ గెలిచే పరిస్థితి లేదని కొలుసు వ్యాఖ్యానించారు. బీసీ నేతను కాబట్టి అక్కడ ఓడినా పర్లేదని భావించారని ఆయన అన్నారు. తనకు నచ్చని నియోజకవర్గాన్ని కట్టబెట్టి ఓడించాలనే వ్యూహం ఏదో పన్నారని అన్నారు. అందుకే తాను వెళ్లనని తేల్చి చెప్పానని.. ఇది పార్టీకి నచ్చలేదని..అన్నారు.
“గతంలో వైసీపీపై చాలానే అంచనాలు వేసుకున్నా.. బలహీనవర్గాలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని గతంలో చెప్పా. అది తప్పని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు“ అని పార్థసారథి వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీలు ఎవరి కాళ్లపై వారు నిలబడాలనుకుంటారని, మరొకరి పెత్తనంపై ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం చంపుకోరని ఆయన అన్నారు. అయితే.. పార్టీ మార్పుపై మాత్రం కొలుసు గంబీరంగా వ్యవహరించారు. దీనిపై ఆయన స్పందించలేదు. కానీ, ఈ నెల 18న ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్నాయి.