ఓటమిపై చిత్తశుద్దితో విశ్లేషణ చేసుకోవటం ఓడిపోయిన పార్టీలకు చాలా అవసరం. అలా కాకుండా ఓటమిపై అడ్డుగోలు, విచిత్రమైన వాదనలు, సమర్ధింపులతో గెలిచిన పార్టీపై బురద చల్లేయాలని చూస్తే ఓడిన పార్టీలకే నష్టం అన్న విషయం స్పష్టం. ఇపుడిదంతా ఎందుకంటే కేటీఆర్ వ్యవహారశైలి గురించే. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం అవసరమైన సన్నాహక సమావేశాలను కేటీయార్ నిర్వహిస్తున్నారు. పనిలోపనిగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపైన కూడా పోస్టుమార్టమ్ జరుగుతోంది.
ఈ పోస్టుమార్టమ్ లో ఓడిపోయిన నేతలు, గెలిచిన ఎంఎల్ఏల్లో కొందరు పార్టీలోని లోపాలను ప్రస్తావిస్తున్నారు. మరికొందరు పదేళ్ళ పాలనలో జరిగిన వ్యవహారాలను ఎత్తిచూపుతున్నారు. అయితే కేటీయార్ మాత్రం చాలా విచిత్రంగా ఓటమిని కూడా సమర్ధించుకుంటున్నారు. తాజాగా కేటీయార్ ఏమన్నారంటే బీఆర్ఎస్ ఓడిపోలేదట. నైతికవిజయం కారుపార్టీదే అనంటున్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించలేదట. కాంగ్రెస్ తప్పుడు హామీలు, 420 వాగ్దానాలు చేసి జనాలు మోసంచేసి ఓట్లేయించుకున్నట్లు ఆరోపిస్తున్నారు.
జనాలు కాంగ్రెస్ కు ఓట్లేసినా ముఖ్యమంత్రిగా కేసీయార్ నే కోరుకుంటున్నారనే విచిత్రమైన వ్యాఖ్యలు చేయటం కేటీయార్ కే చెల్లింది. కాంగ్రెస్ కు జనాలు ఓట్లేసిందే బీఆర్ఎస్ ను ఓడించాలని. బీఆర్ఎస్ ఓడిన తర్వాత ఇక కేసీయార్ సీఎం ఎలాగవుతారు ? ఇక్కడ సమస్య ఏమిటంటే బీఆర్ఎస్ ఓటమితో పాటు కాంగ్రెస్ గెలుపును కేటీయార్ తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజం. బీఆర్ఎస్ గెలిస్తే జనాలు విజ్ఞత చూపించినట్లు ఓడిస్తే తప్పుచేసినట్లుగా కేటీయార్ మాట్లాడుతున్నారు.
పదేళ్ళ తమ పాలనలోని అరాచకాలు, అవినీతి ఒక్కోటిగా బయటపడుతుండటాన్ని కేటీయార్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముందుముందు ఇంకేమేమి బయటపడతాయో జనాల ముందు దోషులుగా నిలవాల్సొస్తుందో అన్న టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజిలో అవకతవకలు, నాసిరకం నిర్మాణం లోపాలు, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖల వేలాది కోట్ల రూపాయల అప్పులన్నీ బయటపడతున్నాయి. ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకుని కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. వీటి కారణంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను జనాలు మళ్ళీ ఎక్కడ తిరస్కరిస్తారో అనే టెన్షన్ కేటీయార్లో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పిచ్చిమాటలన్నీ మాట్లాడుతున్నారు.