ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. ఏపీలోని అధికార.. విపక్ష పార్టీల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించి కేశినేని బ్రదర్స్ మధ్య లొల్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేశినేని నాని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానికి బదులుగా మరొకరిని ఎంపిక చేయనున్నట్లుగా ఆయన పేర్కొనటమే కాదు.. తిరువూరు సభ విషయంలో తనను కలుగ చేసుకోవద్దని చంద్రబాబు సమాచారం పంపినట్లుగా వెల్లడించారు.
ఇంతకూ కేశినేని నాని పెట్టిన పోస్టును చూస్తే.. ‘‘అందరికీ నమస్కారం.. నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురాం గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ గారు నన్ను కలిశారు. ఏడో తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు గారు నియమించారని చెప్పారు.
సభ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియచేసారు . అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి పార్టీ వ్యవహారలో నన్ను ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియచేసారు. అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి నేను హామీ ఇచ్చాను’’ అని విజయవాడ ఎంపీ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులో తెలియజేశారు.
తిరువూరు సభ విషయంలో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం రేగింది. ఈ క్రమంలో ఈ సభను నిర్వహించే బాధ్యతలు.. టీడీపీ అధినాయకత్వం కేశినేని నాని సోదరుడు శివనాథ్ (చిన్ని)కి అప్పగించినట్లుగా చెబతున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాల్ని నాలుగు గోడల మధ్య కూడా తేల్చుకోవచ్చు. కానీ.. నాని మాత్రం పార్టీకి తాను ఎంత కమిటెడ్ అన్న విషయాన్ని చాటి చెప్పేలా చెబుతూనే.. చెప్పా్ల్సిందంతా సోషల్ మీడియా పోస్టు ద్వారా చెప్పేశారని చెప్పాలి.
అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పే నాని.. అదే నిజమైతే.. ఈ రీతిలో పోస్టు పెట్టరని చెబుతున్నారు.
దీంతో.. తిరువూరు సభకు కేశినేని నాని హాజరవుతారా? లేదా? అన్నదిప్పుడు చర్చగా మారింది. మరోవైపు కేశినేని చిన్నా స్పందిస్తూ.. తాను కేవలం కార్యకర్తను మాత్రమేనని స్పష్టం చేశారు. తిరువూరు సభలో అధినేత చంద్రబాబు ఆదేశాల్ని మాత్రమే పాటిస్తానని.. సభను విజయవంతం చేయటానికి తానో కార్యకర్తగా మాత్రమే పని చేస్తానని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నదే తన లక్ష్యమని.. ఆ దిశగానే పని చేస్తున్నట్లుగా చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే హక్కు ఉందని.. అందుకు తగ్గట్లే తాను తిరువూరు సభ కోసం పని చేస్తున్నట్లుగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవటం మాత్రమే తన ముందున్న ఏకైక లక్ష్యమని ప్రకటించిన చిన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆయన చెప్పినట్లుగా తాజా ఇష్యూ టీ కప్పులో తుపానులా సమిసిపోతుందా? లేదంటే అంతకంతకూ పెరిగి పెద్దది అవుతుందా? అన్నది రానున్న రోజులు స్పష్టం చేయనున్నాయి. మొత్తంగా చూస్తే.. కేశినేని నాని ఒద్దికగా.. విధేయతతో ఉన్నట్లుగా వ్యవహరిస్తూనే సోషల్ పోస్టుతో షాకిచ్చారని చెప్పకతప్పదు.