2024 సంక్రాంతి పండక్కి ఏకంగా ఐదు సినిమాలు షెడ్యూల్ కావడం.. వాటిలో ఏది రేసు నుంచి తప్పుకునేలా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు- త్రివిక్రమ్ సినిమా గుంటూరు కారంతో పాటు హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగా సంక్రాంతి బరిలో నిలిచాయి. వీటిలో హనుమాన్ పేరుకే చిన్న సినిమా కానీ దానిమీద ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రోమోలకు వస్తున్న రెస్పాన్స్ యే అందుకు నిదర్శనం.
సంక్రాంతి రేసు నుంచి హనుమాన్ ను తప్పించడానికి సినీ పెద్దల నుంచి గట్టి ఒత్తిడి వస్తున్నప్పటికీ చిత్ర బృందం అస్సలు తగ్గడం లేదు. సినిమా మీద గట్టి నమ్మకంతో సంక్రాంతి రేసులోనే కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 12నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. ఓవైపు హనుమాన్ ను పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నాలు జరుగుతుండగా… ఆ చిత్ర బృందం రిలీజ్ ప్రణాళికలో బిజీ అయిపోయింది.
ఈ క్రమంలోనే హనుమాన్ టీం విడుదలకు ఒక్కరోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమియర్స్ కు రెడీ అయిపోవడం విశేషం. జనవరి 12న ఏపీ, తెలంగాణలోని మేజర్ సిటీలన్నిటిలోనూ హనుమాన్ ప్రిమియర్స్ పడబోతున్నాయి. గత ఏడాది చాలా చిత్రాలకు ఇలా పెయిడ్ ప్రిమియర్స్ వేయడం… బేబీ, సామజవరగమన లాంటి చిత్రాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం తెలిసిందే. అయితే సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రిమియర్స్ పడిన చరిత్ర దాదాపు లేదనే చెప్పాలి.
జనవరి 12న గుంటూరు కారంతో పోటీ పడడం వల్ల హనుమాన్ సినిమాకు చాలా తక్కువ స్క్రీన్లు దక్కుతున్నాయి. అందుకే ముందు రోజు వీలైనంత ఎక్కువగా ప్రీమియర్ షోలు వేద్దామని చిత్రబంధం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి ఇంత పోటీలో రిలీజ్ అవుతూ.. ముందు రోజే ప్రిమియర్స్ వేయడం అంటే పెద్ద రిస్క్ అన్నట్లే. కానీ ముందు నుంచి హనుమాన్ టీం సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే పెయిడ్ ప్రిమియర్స్ కు రెడీ అయిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రిమియర్స్ పడినా ఆశ్చర్యం లేదు.