ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ చదరంగం రసవత్తరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఏపీ కాంగ్రెస్ పై వైఎస్ షర్మిల ఫోకస్ చేయడం వైసీపీ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీలో వేరు కుంపట్లకు తెరలేపింది. అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు… టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ల వైపు మొగ్గు చూపుతుండటంతో వైసీపీ అధిష్టానం ఇరకాటంలో పడింది.
ఈ నేపథ్యంలోనే పుండు మీద కారం చల్లినట్లు తాజాగా సీఎం జగన్ బావ, వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బీటెక్ రవి భేటీ కావడం సంచలనం రేపుతోంది. కడప ఎయిర్పోర్ట్ లో వీరిద్దరూ మాట్లాడుకుంటున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల వస్తే ఎలా ఉంటుందని బీటెక్ రవిని అనిల్ అడిగినట్లుగా తెలుస్తోంది. అన్ని విధాలుగా బాగుంటుందని రవి దానికి సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కడప జిల్లా రాజకీయాలపై కూడా వీరిద్దరూ అరగంటకు పైగా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆల్రెడీ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల గిఫ్ట్ పంపించిన వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక, జగన్ పై పులివెందులలో రాజకీయ కయ్యానికి కాలు దువ్వుతున్న బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి, ఈ పరిణామాలపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.