ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజుకున్న రాజకీయ కుంపట్లు.. ఇప్పుడు బాపట్ల తీరానికి కూడా చేరుకున్నా యి. ఉమ్మడి ప్రకాశంలోనే కీలక నాయకులు.. బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మాజీ మంత్రి శిద్దారాఘవరావు వంటివారికి టికెట్లను ఇప్పటికీ కన్ఫర్మ్ చేయకపోవడంతో ఇక్కడ పొలిటికల్ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే.. మరోవైపు, ఇప్పుడు బాపట్ల అసెంబ్లీ నియజకవర్గంలోనూ వైసీపీలో సునామీ తెరమీదకు వచ్చింది.
సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా జెడ్పీటీసీలు రోడ్డెక్కారు. ఆయనకు టికెట్ ఇస్తే.. పార్టీకి రాజీనామా చేస్తామని కొందరు.. పార్టీలోనే ఉంటూ.. రఘుపతిని ఓడిస్తామని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. “నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన కు టికెట్ ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే ఓడిస్తాం“ అని, జెడ్పీటీసీ సభ్యురాలు సురేఖ ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో అధిష్టానం రఘుపతికి సీటు ఇస్తే, తామంతా తెలుగుదేశం పార్టీలో చేరుతామని మరికొందరు చెబుతున్నారు. ఎమ్మెల్యే రఘుపతి దళిత వర్గానికి చెందిన తమను పలుమార్లు అవమానించారని వైసీపీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారీ ఎస్సీ మహిళకు సీటు ఇచ్చామని అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకున్నారని సురేఖ పేర్కొన్నారు. అభివృద్ధి పనులు చేస్తామంటే అవహేళనగా మాట్లాడారన్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కోన రఘుపతికి కాకుండా మరెవ్వరికి టికెట్ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని సురేఖ సహా పలువురు వెల్లడించారు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని సురేఖ కోరారు. అధిష్ఠానం అన్నీ ఆలోచించి ఎమ్మెల్యే టిక్కెట్‌ను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే, అందరం కలిసికట్టుగా కష్టపడి పని చేసి ఎమ్మెల్యేను గెలిపించుకుంటామన్నారు. ఇదిలావుం టే.. మరోవైపు మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి కుమారుడు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడం గమనార్హం.