సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ విధ్వంస నామ సంవత్సరంగా 2023 మిగిలిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. 2024లో రాక్షస పాలన అంతరించి ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని జోస్యం చెప్పారు. జగన్ టికెట్స్ లేవంటే వైసీపీ నేతలు హ్యాపీగా వెళ్లిపోతున్నారని అన్నారు. వైసీపీ బి.ఫామ్ ఎవరికిచ్చినా ఓడిపోతారని, టీడీపీ, జనసేన బి ఫామ్ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు అరెస్టుతో 2024లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు అరెస్ట్ తోనే జగన్ పతనం పూర్తయిందని అన్నారు.
ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ పతనం ప్రారంభమైందని, చంద్రబాబు అరెస్ట్ తో పతనం పూర్తయిందని బుద్ధా వెంకన్న చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడమే బాకీ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాడడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఇక, పేదల భూముల్ని లాక్కునేందుకే జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, జగన్ ఉద్దేశపూర్వక సమస్యలు సృష్టించి పరిష్కరించేందుకు వాటాలు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూములు, ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు.