టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది. మూడో రోజు పర్యటన సందర్భంగా కుప్పంలో బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ను చంద్రబాబు ప్రారంభించారు. క్యాంటీన్ లో భోజనం చేసేందుకు వచ్చిన ప్రజలకు చంద్రబాబు స్వయంగా భోజనం వడ్డించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూస్తున్నానని, వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనిపిస్తోందని అన్నారు.
35 ఏళ్లుగా కుప్పం ప్రజలు ఆదరిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో కుప్పంలో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక, కుప్పంలో అంగన్వాడీలకు ధైర్యం చెప్పిన చంద్రబాబు…జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను జగన్ నిలబెట్టుకోలేకపోయారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక, టీడీపీ పాలనలో కుప్పం అభివృద్ధి చెందిందని, కానీ, కుప్పంపై జగన్ శీత కన్నేశారని చంద్రబాబు ఆరోపించారు.
కుప్పంపై జగన్ కక్ష సాధిస్తున్నారని, గూండాయిజం భూకబ్జాలు, గ్రానైట్, అక్రమ ధందాలతో కుప్పాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. కుప్పంపై జగన్ కు ఎందుకు అంత పగ అని చంద్రబాబు ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎంతో కష్టపడ్డానని, 87% పనులు పూర్తి చేశానని అన్నారు. కానీ, మిగతా 13 శాతం పూర్తి చేయలేక దద్దమ్మ ప్రభుత్వం ఇలా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. పులివెందులకు నీళ్లు ఇస్తానని తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని, కుప్పం కంటే పులివెందులకు ముందు నీళ్లు ఇచ్చానని గుర్తు చేసుకున్నారు.
కానీ, ఈ ప్రభుత్వం మాత్రం కుప్పంపై కక్ష సాధిస్తుందని మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని, తాము అధికారంలోకి వస్తే ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. అయితే, బాబు రావాలంటే ఏం చేయాలి అని యువతకు చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ విజయానికి 100 రోజులు పని చేయాలని యువతను చంద్రబాబు కోరారు. గ్రామ గ్రామాన తిరిగి ఫ్యాను తిరగకుండా చేయాలని, యువత భవిష్యత్తు గ్యారెంటీ తాను తీసుకుంటానని చంద్రబాబు అన్నారు.