కొంతకాలంగా పులివెందులలో సీఎం జగన్ పై పులివెందుల టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులు క్రితం బీటెక్ రవిని హఠాత్తుగా పోలీసులు అరెస్ట్ చేసిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా బీటెక్ రవికి గన్ మెన్ల భద్రతను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. ఈరోజు ఉదయం తన ఇద్దరు గన్ మెన్లను తొలగించడంపై బీటెక్ రవి మండిపడ్డారు.
తనకేం జరిగినా సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిలదే బాధ్యత అని బీటెక్ రవి షాకింగ్ కామెంట్లు చేశారు. తనను చంపేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని, అందుకే గన్మెన్లను తీసివేశారని ఆరోపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు మారుస్తున్న జగన్ తన సీటు కూడా మార్చుకుంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. అలా జరిగితే జగన్ పోటీ చేసిన స్థానం నుంచే తనకు కూడా టీడీపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.
పులివెందుల ప్రజలను జగన్ మోసం చేశారని, ఆ మోసాలను ఎండగట్టి తాను జగన్ పై గెలవాలని అనుకుంటున్నానని అన్నారు. అటువంటి సందర్భంలో పులివెందుల నుంచి జగన్ పోటీ చేయకుంటే తన పరిస్థితి ఏంటి అని బీటెక్ రవి మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు.