టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. తన పాదయాత్ర సందర్భంగా రెడ్ బుక్ చూపిస్తూ కొందరు అధికారులకు, పోలీసులకు లోకేష్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని హైకోర్టులో సిఐడి అధికారులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆ రెడ్ బుక్ పై లోకేష్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించి, నిబంధనలను అతిక్రమించిన అధికారుల పేర్లను మాత్రమే రెడ్ బుక్ లో రాశానని లోకేష్ అన్నారు.
తప్పు చేసిన అధికారుల గురించి మాట్లాడడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అలా అయితే సిఐడి స్క్రిప్ట్ రాసివ్వాలని, అదే చదువుతానని, లేదంటే సజ్జల స్క్రిప్ట్ ఇచ్చిన పర్వాలేదు అని సెటైర్లు వేశారు. ఇక, వర్మ రూపొందించిన వ్యూహం చిత్రంపై కూడా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యూహానికి ప్రతి వ్యూహం ఉండకూడదని అనుకుంటే ఎలాగని వర్మకు చురకలంటించారు. ఎన్నికల ముందు ఈ టైపు సినిమాలు రావడం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు.
వర్మ నిజంగా సినిమా తీయాలనుకుంటే, దమ్ముంటే హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్ లో అవినీతి వంటి సినిమాలు తీయాలని లోకేష్ సవాల్ విసిరారు. ఇక ఎన్నికల్లో ఓడిపోయే సీట్లనే బీసీలకు జగన్ ఇస్తున్నారని లోకేష్ ఆరోపించారు. కడప, పులివెందుల స్థానాలు బీసీలకు ఇవ్వగలరా అని జగన్ ను నిలదీశారు. చిలకలూరిపేటలో పనికిరాని విడుదల రజిని గుంటూరు వెస్ట్ లో ఎలా పనికొస్తారని లోకేష్ ప్రశ్నించారు.