ఇటీవల అధికార పార్టీ వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తన పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. దీనిపై వైసీపీ అధిష్టానం కూడా పెద్ద సీరియస్‌గా స్పందించింది లేదు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్న దరిమిలా.. మంగళగిరి టికెట్‌ను వారికే కేటాయించనుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రకటనే రావాల్సి ఉంది.
ఇదిలావుంటే.. నిన్నగాక మొన్న వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల.. ఇక, తాను రాజకీయాల నుంచి తప్పుకొం టున్నట్టు ప్రకటించారు. అంతేకాదు.. సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకరించారంటూ.. అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పేశారు. ఇది అందరూ నిజమేనని భావించారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు మరో చర్చ తెరమీదికి వచ్చింది. ఆళ్ల రామకృష్నారెడ్డి కాంగ్రెస్‌లోకి చేరుతున్నారనే వార్త.. మంగళగిరి వ్యాప్తంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌పార్టీలో మారుతున్న రాజకీయ సమీకరణలు.. పరిణామాల నేపథ్యంలో ఆళ్ల ఆ పార్టీ లో చేరనున్నారనేవార్తలు హల్చల్ చేస్తున్నాయి. మంగళగిరిలో ఎక్కడ చూసినా, ఏ ఇద్దరు కలిసినా.. ఇదే చర్చ సాగిస్తున్నారు. ఆయన చేరిక ఖాయమైందని.. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ సాగిందని అంటు న్నారు. అయితే.. ఈ చర్చకు బలం చేకూరుస్తున్న విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీ స్థాయిలో ఏఐసీసీ చర్చలు జరిపింది.
ఈ క్రమంలో వైసీపీ నుంచి వచ్చే నాయకులను కూడా తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అంతేకాదు.. వైసీపీలో ఉన్న సగం మంది మన వాళ్లేనని.. వారు వస్తామంటే తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో నే ఏపీలో ఆశావహులుగా ఉన్న నాయకుల జాబితాను ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఈ జాబితాలో ఆళ్ల పేరు కూడా ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారనే చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. గతంలో ఆళ్ల కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడే కావడం గమనార్హం.