సలార్ విజయంతో ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న డార్లింగ్ ప్రభాస్ కు మరో తీపి కబురు అందింది. వచ్చే నెల(జనవరి)22న అయోధ్యలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందింది. జనవరి 22న నిర్వహించే రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంపిక చేసిన వారిని మాత్రమే అయోధ్య ట్రస్టు ఆహ్వానాలు పంపుతోంది. ఆహ్వానాలు అందుకున్న వారు మాత్రమే హాజరుకావాలని ఇప్పటికే సీఎం యోగి సర్కారు స్పష్టం చేయటం తెలిసిందే.
టాలీవుడ్ కు ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే అయోధ్య నుంచి ఇన్విటేషన్ అందింది. తాజాగా డార్లింగ్ ప్రభాస్ కు ఆహ్వానం అందింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాలీవుడ్ నుంచి పలువురికి ఆహ్వానాలు అందగా.. టాలీవుడ్ నుంచి చిరుకు మాత్రమే ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆ జాబితాలో ప్రభాస్ చేరారు.
బాలీవుడ్ విషయానికి వస్తే రణ్ బీర్ కపూర్.. ఆలియాభట్.. అజయ్ దేవ్ గన్.. సన్నీ డియోల్.. టైగర్ ష్రాప్.. ఆయుష్మాన్ ఖురానా.. యశ్ తో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరికి ముందు అమితాబ్ బచ్చన్.. అక్షయ్‌కుమార్.. రజనీకాంత్.. మోహన్ లాల్.. సంజయ్ లీలా బన్సాలీ.. మాధురి దీక్షిత్.. అనుపమ్‌ఖేర్.. ధనుశ్.. రిషబ్ శెట్టిలకు కూడా ఆహ్వానాలు అందాయి.
తాజాగా ఇన్విటేషన్ నేపథ్యంలో ‘అయోధ్య కాలింగ్’ అంటూ డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ శ్రీరాముల వారి పాత్రను ప్రభాస్ పోషించటం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ లభించనప్పటికీ.. శ్రీరాముడి పాత్రకు ప్రభాస్ న్యాయం చేసిన క్రెడిట్ దక్కింది. రీల్ శ్రీరామచంద్రుడికి రియల్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగే రాములోరి విగ్రహ ప్రోగ్రాంకు ఆహ్వానం అందటం డార్లింగ్ అభిమానులకు మరింత హ్యాపీ న్యూస్ గా చెప్పాలి.