దగ్గుబాటి వెంకటేశ్వరరావు. గత నాలుగేళ్లకుపైగానే ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనిపించని ఆయన తాజాగా సంచలనం రేపారు. వైసీపీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ.. మీడియాలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు. వాస్తవానికి ఈ టికెట్‌ను ఆయన తన కుమారుడు హితేష్ చెంచురాం కు ఇప్పించుకోవాలని భావించారు.
అయితే.. అమెరికా పౌర సత్వం రద్దు కాకపోవడంతో హితేష్ రాలేక పోయారు. ఈ క్రమంలో చివరి నిము షంలో దగ్గుబాటి పోటీ చేశారు. అయితే.. ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. కాగా, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఆయన గత సంగతులను వెల్లడించారు. తాను ఓడిపోవడమే మంచిదైందని.. లేకపోతే.. ప్రజలకు తన మొహం చూపించే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.
అదేసమయంలో తాను ఓడిపోయినప్పటికీ.. తర్వాత సీఎం జగన్ పిలుపుతో తాడేపల్లికి వెళ్లానని.. తనకు మంత్రి పదవిని ఇస్తామన్నారని.. తన కుమారుడు హితేష్‌కు ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తామన్నారని చెప్పుకొచ్చారు. అయితే.. దీనికి కొన్ని `షరతులు` విధించారని.. అవి నచ్చక పోవడంతోనే తాను మంత్రి పదవిని వదులుకున్నానని చెప్పారు. తాను షరతులకు లొంగే వ్యక్తిని కాదని, పదవుల కోపం పాకు లాడనని వ్యాఖ్యానించారు.
దీంతో ఆ షరతులు ఏంటనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అయింది. దగ్గుబాటి ప్రధాన అనుచరులు కొందరు చెబుతున్న దానిని బట్టి.. దగ్గుబాటి నుంచి రూ.100 కోట్లను పార్టీ ఫండ్ గా కోరారనే విషయం తెరమీదకి వచ్చింది. అదే సమయంలో దగ్గుబాటి వ్యాపారంలో జగన్ వాటా కోరుకున్నారని.. చెబుతున్నారు. ఈ రెండు చేయలేకే.. దగ్గుబాటి తప్పుకొన్నారనేదివీరి వాదన.