ఏపీలో ఎటు చూసినా.. జగన్ మా నమ్మకం.. జగనన్నే మా ధీమా! అనే కామెంట్లే కనిపిస్తాయి. వినిపిస్తాయి కూడా! పైగా.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తరఫున పనిచేసేవారు అయితే.. మరింత స్ట్రిక్టుగా ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరించాలి. అయితే.. ఇప్పు డు వాతావరణం మారిపోయింది. పొలిటికల్ సీన్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
తాజాగా క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో మమేకమయ్యే అంగన్ వాడీలు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. 2019 ఎన్నికలకుముందు వైసీపీ అధినేతగా ప్రస్తుత సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ.. కొన్ని రోజు లుగా వారు నిలదీస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలతో వేడెక్కించారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపినా.. ఫలించలేదు. పైగా మహిళా సంక్షేమ మంత్రి ఉష శ్రీచరణ్ చేసిన వ్యాఖ్యలు మరింతగా అంగన్వాడీలకు మంటలు పుట్టించాయి. దీంతో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.
ఈ క్రమంలో మన్యం జిల్లాల్లో అంగన్ వాడీ కార్యకర్తలు.. చంద్రబాబు జపం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో తమ జీవితాలు బాగున్నాయని.. వేతనాలు కూడా సరైన సమయానికి ఇచ్చారని అంగన్ వాడీలు పేర్కొంటున్నారు. జగన్ తమకు పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా..ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి.. ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో 2019లో టీడీపీ ఎన్నికల ప్రచారంలో వినిపించిన పాటలకు అంగన్ వాడీలు కాలికి గజ్జెకట్టి నృత్యాలు చేస్తుండడం గమనార్హం. గ్రూపులుగా ఏర్పడి అంగన్ వాడీ మహిళలు.. “చంద్రన్న పాలనే రామరాజ్యమూ“ అంటూ నృత్యాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.