ఏపీ సీఎం జగన్ సాక్ష్యాత్తూ కలియుగంలో పుట్టిన శ్రీ విష్ణుమూర్తి అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చుకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. మానవమాత్రుడైన జగన్ ను రమణ దీక్షితులు..దైవ సమానుడిగా కీర్తించడంపై విపక్ష పార్టీల నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రమణ దీక్షితులుపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
పింక్ డైమండ్ మాయం వంటి ఆరోపణలు చేసిన వ్యక్తిని..మళ్ళీ టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియమించడం మంచి సాంప్రదాయం కాదని రమణ దీక్షితులును ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలా చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వర స్వామి అని, తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మనుషులను దేవుళ్లతో పోల్చడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడని, మనిషి మనిషేనని, దేవుడు దేవుడేనని చంద్రబాబు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు చేయాలని రమణ దీక్షితులునుద్దేశించి అన్నారు. తాను నమ్మిన దేవుడు వెంకటేశ్వరస్వామి అని, 2003లో అలిపిరి వద్ద తనపై దాడి జరిగినప్పుడు వెంకటేశ్వర స్వామే కాపాడారని అన్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున చంద్రబాబు ప్రచారం చేసేందుకు తిరుపతి వచ్చారు. ఈ క్రమంలోనే తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వర్ల రామయ్యను వేధిస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ వ్యవహారంపై మండిపడ్డ చంద్రబాబు… వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ కరవైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని… వైసీపీ నేతల దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. వర్ల రామయ్య బెదిరింపు కాల్స్ పై సమగ్ర విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేయాలని, వర్ల రామయ్య కుటుంబానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.