కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, అటువంటిది తెలంగాణలో ఎలా అమలు చేస్తుందని కేటీఆర్ పలుమార్లు చురకలంటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి కాంగ్రెస్ పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతులు కరువు కావాలని కోరుకుంటున్నారు అంటూ కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత శివానంద పాటిల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు కరువు కోరుకుంటున్నారని, అప్పుడు ప్రభుత్వం నుంచి రుణమాఫీ డిమాండ్ చేయవచ్చని వారు భావిస్తున్నారని శివానంద చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రైతులకు ఉచితంగా నీరు, కరెంటు వస్తున్నాయని, వ్యవసాయం బలోపేతానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు సహకారాలు అందించారని ఆయన చెప్పారు.
శివానంద పాటిల్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కూడా కర్ణాటకలో పరిస్థితి వస్తుందని, ఇటువంటి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారు ఏ మంత్రులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఏ రైతు కరువు రావాలని కోరుకోడని, ప్రభుత్వం నుంచి సానుభూతిని మాత్రమే ఆశిస్తాడని చురకలంటించారు.