తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు ముందే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ కు 2 రోజులు ముందే రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని బండ్లన్న జోస్యం కూడా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలకు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.
గత పదేళ్లలో తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందని బండ్ల గణేష్ ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నానని, బహిరంగ చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. ఇక, తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన అప్పులపై కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంపై కూడా బండ్ల గణేష్ చురకలంటించారు. పవర్ లేని వాళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే హక్కు లేదని కేటీఆర్ పై బండ్ల గణేష్ విమర్శలు చేశారు.
తెలంగాణను గత ప్రభుత్వం ఏ విధంగా దోచుకుందో లెక్కలతో సహా చెప్పగలమని, ప్రజలు ఎంత వెనుకబడ్డారో నిరూపించగలమని బండ్ల గణేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మారు గనుక అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా పూర్తి కాలేదని, ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే బీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయి విమర్శలు చేయడాన్ని బండ్ల గణేష్ తప్పుపట్టారు. కాంగ్రెస్ కు కొంత సమయం ఇవ్వాలని, అప్పుడే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారని బండ్ల గణేష్ అన్నారు. మరి, బండ్ల గణేష్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.