కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య రాసిన లేఖ నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. నమ్ముకున్న కాపులను ఏం చేస్తారంటూ.. పవన్ను ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి సీటు విషయంలోను, పదవుల విషయంలోనూ ఆశలు వమ్ము చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో జనసేన కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు పలు కీలక అంశాలపై చర్చించారు.
రానున్న ఎన్నికలల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై పార్టీ నేతలతో చర్చించారు. ఈ భేటీకి పీఎసీ సభ్యులు, పార్టీ కీలక నేతలను పవన్ కళ్యాణ్ పిలిపించారు. కేంద్ర కార్యాలయంలో పవన్, నాదెండ్ల మనోహర్ ఇరువురు నేతలతో బలాబలాలపై చర్చలు జరిపారు. టీడీపీ, జనసేన పొత్తు నేపధ్యంలో ఇరు పక్షాల కార్యకర్తలు కలిసి పని చేసే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. పోటీ చేసే స్థానాల్లో ఇరు పక్షాల బలాబలాలపై కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.
ఈ సమావేశంలో తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు హుటాహుటిన మంగళగిరికి చేరుకున్నారు. రాబోయే రెండు రోజుల్లో చర్చల అనంతరం పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ చర్చలు జరిపే అవకాశం ఉంటుందని పలువురు నాయకులు తెలిపారు.
అయితే.. ఈ చర్చల్లో జోగయ్య రాసిన లేఖపైనే ప్రధానంగా చర్చించారని.. ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. జోగయ్య లేఖ మాటల మంటలు, రాజకీయ కాక పెంచడంతోపాటు.. కాపులను జనసేనకు దూరం చేసే ప్రమాదం ఉందన్న విషయంపైనా చర్చించినట్టు తెలిపారు. అయితే.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అంచనా వేస్తున్నామన్నారు. ఆ తర్వాతే పదవులు, పీఠాలపై నిర్ణయం తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చినట్టు తెలిపారు.
అయితే, ఈ లేఖ రాసిన జోగయ్యపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. జనసేనలో జోగయ్య కోవర్ట్ అని, కాపులకు ద్రోహం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. పవన్ తో నేరుగా భేటీ అయ్యి ఈ లేఖలోని విషయాలను చెప్పే అవకాశమున్నప్పటికీ…ఇలా బహిరంగ లేఖ రాసి పవన్ ను, జనసేనను, కాపు సంక్షేమ సంఘాన్ని బజారున పడేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.