ఆర్థిక నేరాలకు పాల్పడిన ఆరోపణలతో ప్రస్తుతం జైల్లో ఉన్న క్రిమినల్ సుకేశ్ చంద్రశేఖర్ కు సంబంధించి మరో ఆప్డేట్ బయటకు వచ్చింది. అతగాడి గర్ల్ ఫ్రెండ్.. బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ కు అతడో లేఖ రాశాడని.. అందులోఆమెను హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. జైల్లో ఉన్న సుకేశ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అతడు తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశిస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆశ్రయించారు.
అంతేకాదు.. అతను తనను ట్రాప్ చేశాడని.. తనపై నమోదైన కేసుల్ని కొట్టేయాలని ఆమె కోరుతున్నారు. జాక్వెలిన్ పిటిషన్ పై స్పందన తెలియజేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్ గురించి తెలుసుకున్న సుకేశ్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఆమెపై ఇన్ డైరెక్టుగా హెచ్చరికలు జారీ చేసిన అతను.. ఆమెకు ఒక లేఖను రాసినట్లుగా చెబుతున్నారు.
ఆమె పేరును నేరుగా ప్రస్తావించకున్నా.. అందులోని అంశాల్నిచూస్తే మాత్రం ఆ లేఖను జాక్వెలిన్ కోసమే రాశారన్న భావం కలుగుతుంది. తాజాగా సుకేశ్ తరఫు న్యాయవాది సైతం జాక్వెలిన్ కు సుకేశ్ లేఖ రాసినట్లుగా పేర్కొనటం గమనార్హం. తాను తీవ్రమైన షాక్ కు గురైనట్లుగా లేఖలో పేర్కొన్న సుకేశ్.. ‘‘ఎవరినైతే భద్రంగా చూసుకోవాలని అనుకున్నానో.. వారే ఇప్పుడు ఎదురు తిరిగారు. వెన్నుపోటు పొడిచారు. బాధితులుగా చెప్పుకుంటూ నాపై నిందలు వేస్తున్నారు. నన్ను చెడ్డవాడిగా చూపించాలని అనుకుంటున్నారు. ఇది నేను కలలో కూడా ఊహించలేదు’’ అంటూ వాపోయాడు.
అంతేకాదు.. తన మనసు ఉన్నది ముక్కలు కావటం కోసమేనన్న వ్యాఖ్యలు చేసిన సుకేశ్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు నిజాలను బయటపెట్టటం మినహా మరో మార్గం లేదని పేర్కొనటం గమనార్హం. ‘‘ఆ వ్యక్తిని రక్షించేందుకు ఇన్నాళ్లు రహస్యంగా దాచి ఉంచిన ఆధారాలన్నీబయటపెడతా. ఇద్దరి మధ్య సాగిన సంభాషణలు.. స్క్రీన్ షాటర్లు.. రికార్డులు.. విదేశీ ఆర్థిక లావాదేవీలు.. పెట్టుబడులు అన్ని చెప్పేస్తా. ఆ వ్యక్తికి సోషల్ మీడియాలో ప్రచారం కోసం మిలియన్ డాలర్లు ఖర్చు చేశా. అందుకు సంబంధించిన ఆధారాల్ని బయటపెడతా. ఈ వాస్తవాల్నిప్రపంచం తెలుసుకోవాలి’’ అంటూ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.